సెల్‌లో వీడియో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టిన ఆకతాయిలు
నిందితుడు సహా నలుగురి అరెస్ట్
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): చెత్త సేకరించే మహిళను పెళ్లి పేరుతో నమ్మించి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై పట్టపగలే రోడ్డు పక్కన షెల్టర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళ్లే వారు ఆ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారే తప్ప, అడ్డుకోలేదు. తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కోయ్‌లా పాఠక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్ అనే వ్యక్తి చెత్త ఏరుకునే ఓ మహిళతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను సమీపంలోనే రోడ్డు పక్కన షెల్టర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు.
అయితే, రోడ్డు పక్కన వెళ్లే వారు అసాంఘిక కృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారే తప్ప, అడ్డుకోలేదు. పైపెచ్చు, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. వైరల్‌గా మారిన ఒక వీడియో పోలీసుల కంటబడింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకాశ్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఇంట్లోనే ఉందని సీపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment