సాక్షి, చెన్నై: ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో శుక్రవారం జరిగింది. వివరాలు.. చెన్నై అశోక్‌నగర్‌కు చెందిన యువతి (26) బ్యాంకులో పనిచేస్తోంది. ఈమెకు చెన్నైలో ట్సాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని అచ్చమంగళం గ్రామానికి చెందిన రామన్‌తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. వివాహం చేసుకోవాలని యువతి పట్టుబట్టడంతో రామన్ ఎవరికీ తెలియకుండా సొంతూరుకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి జనవరి 27న జోలార్‌పేటలోని రామన్ ఇంటి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
వివాహానికి వారు అంగీకరించకపోవడంతో ఇంటి ముందే నిరసన తెలిపింది. 9 రోజులైనా పట్టించుకోకపోవడంతో శుక్రవారం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment