సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం రూరల్: నగరశివారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూవివాదం ఇద్దరు రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస్‌రెడ్డి (38), కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40)లు తమ వాహనంలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణలతో కలిసి సందర్శించారు. హతులిద్దరికీ నేరచరిత్ర ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
నోట్లో గన్ పెట్టి..: శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి తమ స్కార్పియో వాహనంలో కర్ణంగూడలోని లేక్‌విల్లా అర్చిడ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ స్థల వివాదంపై నల్లగొండకు చెందిన మట్టారెడ్డితో మాట్లాడిన అనంతరం తిరుగుముఖం పట్టారు. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించారో లేదో గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వీరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌రెడ్డి తలలో రెండు బుల్లెట్లు, రాఘువేందర్‌రెడ్డి ఛాతి భాగంలో ఒక తూటా వెళ్లాయి. శ్రీనివాస్‌రెడ్డి కారు దూకి పారిపోతుండగా.. దుండగులు ఆయనను పట్టుకొని తుపాకీని నోట్లో పెట్టి కాల్చినట్లు తెలుస్తోంది. రాఘువేందర్ రెడ్డి కారులో పారిపోతుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులోనే సుమారు అరగంటపాటు కొట్టుమిట్టాడినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు రాఘువేందర్‌ను బీఎన్‌రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యం కాగా.. కారులో రెండు బుల్లెట్ షెల్స్ లభించాయి. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న హఫీజ్, కృష్ణతోపాటు మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
భూ వివాదమే కారణమా?
ఇబ్రహీంపట్నం పరి«ధిలోని చర్లపటేల్‌గూడ రెవెన్యూ పరి«ధిలో ఇరవై ఏళ్ల క్రితం కొంతమంది రైతులు నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రారెడ్డి అనే రియల్టర్‌కు కొంత భూమిని విక్రయించారు. ఆయన ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించగా.. వాళ్లు లేక్‌విల్లా ఆర్చిడ్స్ పేరుతో సుమారు 200–300 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 1,111 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ధరణి వచ్చాక ఆ భూమి తిరిగి ఇంద్రారెడ్డి పేరుపై ఉన్నట్లు చూపించింది. రైతుబంధు పథకం కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో ఇంద్రారెడ్డి నుంచి పదెకరాల స్థలాన్ని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించి శ్రీనివాస్‌రెడ్డి పదెకరాల పొలం చదును చేసి బోర్లు వేసి వ్యవసాయ భూమిగా మార్చాడు. మట్టారెడ్డి, ఇంద్రారెడ్డిలు శ్రీనివాస్‌రెడ్డితో రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇంద్రారెడ్డి, మట్టారెడ్డి సోమవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు.
న్యాయవాది హత్య కేసులో దోషి
రాఘవేందర్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి హైకోర్టులో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. 2004లో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో రాఘవేందర్ రెడ్డి (ఏ–2) నిందితుడిగా ఉన్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నేరంలో రాఘవేందర్‌కు కోర్టు జీవితకాలం శిక్ష విధించగా, శిక్ష అనంతరం ఇటీవలే రాఘవేందర్ బయటకు వచ్చినట్లు సీపీ చెప్పారు. ఇదిలాఉండగా.. రెండు నెలల క్రితం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైందన్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత బావనే కేసు పెట్టాడని, బావ మీద శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు పెట్టాడని వివరించారు.
కేసును చాలెంజ్‌గా తీసుకున్నాం: రాచకొండ సీపీ
జంట హత్యల కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇతరత్రా వివరాలను రాబట్టేందుకు సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చివరిసారిగా మృతులు ఎవరితో మాట్లాడారు? సంఘటనాస్థలం వద్ద ఎవరెవరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఎవరికి సుపారీ ఇచ్చారు? తుపాకీ ఎక్కడిది? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతికే పనిలో పడ్డారు.
ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి
Published Tue, Mar 1 2022 10:50 AM | Last Updated on Wed, Mar 2 2022 10:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment