బ్యాంకు ఉద్యోగికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
యూనియన్ బ్యాంకు నర్సరావుపేట బ్రాంచిలో లాకర్‌లోని బంగారం మాయం
బ్యాంకు ఉద్యోగి బీఎం నాయక్‌పై అధికారుల ఫిర్యాదు
అదే నెల చివర్లో నాయక్ పదవీ విరమణ
ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఖాతాలు జప్తు చేసిన అధికారులు
బ్యాంకు తీరును తప్పుపట్టిన హైకోర్టు
చోరీ వల్ల వాటిల్లిన నష్టం రూ.4.42 లక్షలు తప్ప మిగిలిందంతా ఇచ్చేయాలని ఆదేశం
మూడు నెలల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ
ఆలోగా ముగించకపోతే నిలిపివేసిన సొమ్మూ ఇచ్చేయాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.
పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.
పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.
సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.
ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment