దేశంలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీయెత్తున హెరాయిన్ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారి వద్ద నుంచి సుమారు 42 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో పట్టుకున్న దీని విలువ సుమారు రూ.285 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో నలుగురు ఆఫ్రికన్ మహిళలు కాగా ఇద్దరు అఫ్గాన్లు ఉన్నారు.
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఇంతపెద్ద మొత్తంలో మాదకద్రవ్యం పట్టుబడటం కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం తెలిపారు. దీని విలువ రూ.78 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. వారి కథనం ప్రకారం.. ఉగాండాకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలో తాను పోగొట్టుకున్న లగేజీని తీసుకునేందుకు శనివారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది.
ఆ మహిళ ఇటీవల జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగా హైదరాబాద్ వచ్చింది. ఆమెకు లగేజీ తిరిగి ఇచ్చే సమయంలో అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించగా అందులో 4 కిలోల హెరాయిన్‌పౌడర్ లభించింది. దీంతో ఆమెను మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్ యాక్ట్–1985) కింద అరెస్టు చేసి విచారిస్తున్నారు.
బ్యాగ్ పైపుల్లో దాచి..
ఆదివారం తెల్లవారుజామున మకుంబా కొరెల్ అనే మరో మహిళ జాంబియా నుంచి జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగానే హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. ఆమె బ్యాగుపై అనుమానం వచ్చిన డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. బ్యాగుకు అమర్చిన పైపుల్లో అనుమానిత పౌడర్ కనుగొన్నారు. దాన్ని పరీక్షించగా.. అది హెరాయిన్‌గా తేలింది. సుమారు 8 కిలోల పౌడర్‌ను స్వాధీనం
చేసుకున్న అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు...
అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించినప్పుడు చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాక, ఏదో ఒక ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని అధికారులు అంటున్నారు.
గతంలోనూ శంషాబాద్‌లో ఇలాంటి ఘటనలెన్నో...
- దుబాయ్ నుంచి కొకైన్‌క్యాప్సుల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్ దొరికింది.
- సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది.
- బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
- సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
- యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మాఫియా పనే?
ప్రపంచవ్యాప్తంగా హెరాయిన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌తరువాత భారతదేశం ఉంది. అయితే పాకిస్తాన్‌నుంచి పంజాబ్‌లోకి భూభాగం ద్వారా, ముంబై, గోవాలకు సముద్రమార్గం ద్వారా కూడా కొంత సరుకు చేరుతుంటుంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో ఔషధాల తయారీ, వాణిజ్యపంటల ముసుగులో కొందరు అక్రమంగా హెరాయిన్‌ను ఉత్పత్తి చేసి చెన్నై, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల ద్వారా బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా కొకైన్, ఒపియంలు మనదేశానికి అధికంగా దిగుమతి అవుతాయి. అందులోనూ సముద్రమార్గం ద్వారానే అధికంగా అవుతాయి. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో స్మగ్లర్లు వాయుమార్గంలో తీసుకువచ్చేందుకు అంతగా ఆసక్తి చూపరు.
అలాంటిది మనదేశంలో భారీగా ఉత్పత్తి అయ్యే హెరాయిన్‌కిలోల కొద్దీ దిగుమతి కావడం, అందులోనూ వాయుమార్గంలో తీసుకురావడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. శనివారం చెన్నై విమానాశ్రయంలోనూ భారీగా 10 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ కూడా రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసింది. శంషాబాద్‌లో పట్టుబడ్డ ఇద్దరు, చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ మరో ఇద్దరు మహిళలు.. ఈ నలుగురు ఆఫ్రికన్లే కావడం, అందరి వద్దా హెరాయిన్‌లభ్యం కావడంతో దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉండి
ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్‌పిన్‌కూడా ఒకరేనన్న సందేహాలు కలుగుతున్నాయి.
మహిళలపై నిఘా ఉండదనే..!
అంతర్జాతీయ స్మగ్లర్లు ఎక్కువగా మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలా బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ పలు సందర్భాల్లో ఏకంగా తొమ్మిది మంది మహిళలు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. స్మగ్లర్లు అనగానే సాధారణంగా పురుషులనే అనుకుంటారు. ఇక మహిళలు... అందునా నిండు గర్భంతోనో, చంకలో పసి పిల్లలతోనో, అంగవైకల్యంతోనో వచ్చే వారిని అధికారులు పెద్దగా అనుమానించరు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే ఈ తరహా పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్‌ఎర వేస్తూ బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లర్లు అప్పగిస్తున్నారు. వారు వివిధ పంథాల్లో, శరీరంపైనా వాటిని అమర్చుకుని తీసుకువస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment