సాక్షి, హైదరాబాద్: కిలోకు పైగా కొకైన్ డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల రూపంలో పొట్టలో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న టాంజానియా వ్యక్తి (44)ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. పొట్టలోంచి 79 ట్యాబ్లెట్లను బయటకు తీశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి ఈ నెల 21న ఎమిరేట్స్ విమానంలో ఆ వ్యక్తి హైదరాబాద్ చేరుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను టాంజానియా నుంచి జోహెన్నెస్‌బర్గ్ వచ్చానని.. జోహెన్స్‌బర్గ్ నుంచి ఇండియాకు వచ్చే ముందు ప్రొటేరియా వెళ్లి అక్కడ కొకైన్ ట్యాబ్లెట్లు మింగానని అధికారుల విచారణలో వెల్లడించాడు.
3 నుంచి 4 రోజులు కడుపులోనే దాచుకొని మరో వ్యక్తికి డెలివరీ చేయాల్సిందిగా ఆదేశాలున్నాయన్నాడు. ఆ వ్యక్తి నుంచి 22 కొకైన్ ట్యాబ్లెట్స్‌ను అధికారులు బయటకు తీశారు. మిగిలిన ట్యాబ్లెట్లను తీయడం కష్టమవడంతో ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ ద్వారా మంగళవారం మరో 57 ట్యాబ్లెట్లను తీశామని డీఆర్‌ఐ వెల్లడించింది. ఇవి 1,157 గ్రాముల బరువున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.11.57 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ఆ వ్యక్తిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నాడో విచారణ చేయాల్సి ఉందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment