జియాగూడ(హైదరాబాద్): రెండు వేల రూపాయలు కనిపించకుండా పోయిన సంఘటనలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సరూర్‌నగర్‌లో ఉంటున్న రాములమ్మ (50)కు ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు) వారు అల్లుళ్లు నందు, రాజుతో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్‌లో ఉంటున్నారు.రాములమ్మ మరిది కె.రాజు కూడా సరూర్‌నగర్‌లోనే ఉంటున్నాడు. కె. రాజు అమ్ములుకు వరుసకు అన్న.
కాగా ఇటీవల అమ్ములు సరూర్‌నగర్‌లో ఉన్న అన్న కె.రాజును చూసి చాలాకాలమైందని ఇంటికి రావాలని కోరింది. దీంతో కె.రాజు శుక్రవారం తాను వచ్చేటప్పుడు మద్యం (కల్లు) తెచ్చి చెల్లెలు అమ్ములు, విజయలక్ష్మి భర్త నందుతో కలిసి తాగారు. అనంతరం మధ్యాహ్నం ప్రాంతంలో కె.రాజు నిద్రపోయాడు. నిద్ర నుంచి లేచిన కె. రాజు తన వద్ద ఉన్న రెండు వేలు పోయాయంటూ అక్కడే ఉన్న ఓ సెల్‌ఫోన్ తీసుకుని సరూర్‌నగర్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న నందు సరూర్‌నగర్‌కు వెళ్లి కె.రాజు కోసం వెతకగా కనిపించలేదు. దీంతో అక్కడే ఉన్న అత్త రాములమ్మను ఏకలవ్యనగర్‌కు తీసుకువచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న కె.రాజు వెంటనే ఏకలవ్యనగర్‌లో ఉంటున్న అమ్ములు దగ్గరకు వచ్చి నందుతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో అక్కడే ఉన్న జంగయ్య, సరిత, విజయలక్ష్మి, నందు, రాజు, ప్రేమ్ తదితరులు కూడా కె.రాజుతో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో నందు రోకలితో రాజుపై దాడి చేసేందుకు యత్నించగా అడ్డం వచ్చిన రాములమ్మ తలపగిలింది. దీంతో అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment