సాక్షి,బంజారాహిల్స్: మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులను బైక్ ఆధారంగా పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్‌చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు.
మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment