సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారులు రక్తమోడుతున్నాయి.. నిత్యం ఏదోచోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ 17 మంది మృత్యువాత పడుతున్నారు. ము ఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ప్రజారవాణాపై ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. దీంతో రోడ్లపై రద్దీ పెరిగి, ప్రమాదాలకు దారితీస్తోం ది. అతివేగం ప్రమాదాలకు తొలి కారణం కాగా.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనల ఉల్లంఘన తరువాత కారణాలని రోడ్డు భద్రత అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారులు వాటిని పాటించకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోంది.
90% అతివేగమే కారణం
రోడ్డు ప్రమాదాల్లో నూటికి 90 శాతం అతివేగమే కారణం. ఇటీవల సిద్దిపేట వద్ద అతివేగంగా కారు డ్రైవింగ్ చేసి దాన్ని రోడ్డు పక్కన కల్వర్టుకు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తుండగా డీసీఎం వ్యాను నిర్లక్ష్యంగా దూసుకురావడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగింది పట్టపగలే.. అందులోనూ అది విశాలమైన రోడ్డే. మరోవైపు హైదరాబాద్–బీజాపూర్ హైవేపై లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలకు అతి వేగంతో పాటు నిర్లక్ష్యం కారణమని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్ వరకు కమిషనరేట్లు, జిల్లాల వారీగా మృతులు
మరణాల్లోనూ గ్రేటరే..
రోడ్డు ప్రమాదాల మరణాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచాయి. కమిషనరేట్ల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్ (193), సైబరాబాద్ (582), రాచకొండ (466) కమిషనరేట్లు మృతుల సంఖ్య అధికంగా ఉంది. గ్రేటర్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డిలోనూ మృతుల సంఖ్య 300గా ఉంది. మొత్తం రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో చివరి స్థానాల్లో నారాయణపేట (60), ములుగు (62) జిల్లాలు నిలిచాయి. ఇక్కడ గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్లు, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్లగొండల్లో జాతీయ రహదారులున్నాయి. అందుకే, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, మృతులు అధిక సంఖ్యలో ఉన్నారు.
లాక్‌డౌన్ తర్వాత పెరిగిన ప్రమాదాలు..
మార్చిలో లాక్‌డౌన్ విధించిన దరిమిలా రోడ్డు ప్రమాదా లు గణనీయంగా తగ్గాయి. వాహన సంచారం, రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు చాలా మేరకు తగ్గాయి. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమం గా ఎత్తేసినా.. కరోనా భయం మాత్రం పోలేదు. దీంతో ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రా ధాన్యమిస్తున్నారు. ఫలితంగా రోడ్లపై రద్దీ పెరిగింది. సరైన అనుభవం లేనివారు కూడా జాతీయ రహదారులపై వాహనాలను వేగంగా పోనిస్తున్నారు. ఫలితంగా లాక్‌డౌన్ తర్వాత ప్రమాదాలు పెరిగాయి.
నెలకు 1,486 ప్రమాదాలు
రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు 14,864 ప్రమాదాలు జరిగాయి. ప్రతీనెల 1,486 ప్రమాదాలు జరుగుతుండగా.. రోజుకు 49 మంది, ప్రతీ గంటకు రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6,809 మంది మరణించగా.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 5,209 మంది రోడ్డు ప్రమాదాల్లో బలయ్యారు. ఈ లెక్కన ప్రతి నెలకు 520 మంది మరణిస్తుండగా.. ప్రతీరోజూ 17 మందికి పైగా రహదారుల వెంబడి తుది శ్వాస విడుస్తున్నారు. ఈ గణాంకాలను విశ్లేషించగా.. ప్రతీ 72 నిమిషాలకు ఒక ప్రాణాన్ని రోడ్డు మింగేస్తోంది.
అతివేగాన్ని నియంత్రించలేక..
ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో నూటికి 90 శాతం కారణం అతివేగమే. జాతీయ రహదారులపై చాలామంది 120 కి.మీ.లకు పైగా వేగంతో దూసుకెళ్తున్నారు. ఆ వేగంలో వెళ్తున్నపుడు ఆకస్మికంగా మరో వాహనం ఎదురైనపుడు నియంత్రించడం కష్టంగా మారుతుంది. ఫలితంగా బ్రేకులు వేసినా.. ఎలాంటి ప్రయోజనముండదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
–సందీప్ శాండిల్య, ఏడీజీ (రోడ్ సేఫ్టీ)
Comments
Please login to add a commentAdd a comment