సాక్షి, హుబ్లీ (కర్ణాటక): దేశ రక్షణకు పాటుపడాల్సిన ఓ జవాన్ అమాయక యువతులను మోసం చేయడం పనిగా పెట్టుకున్నాడు. హుబ్లీ చెందిన ఈ సైనికుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతని వంచనపై మొదటి, రెండవ భార్యలు హుబ్లీ పోలీసులను ఆశ్రయించారు. హుబ్లీ తాలూకా నెలవడి గ్రామవాసి గురుసిద్దప్ప సిరోళ పంజాబ్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు 2015లో ఇతనికి గదగ్ జిల్లాకు చెందిన రేఖ అనే యువతితో పెళ్లి చేశారు.
వీరికి ఓ కుమారుడు పుట్టాడు. ఈ ఘనుడు తరచూ భార్యను వేధిస్తుండడంతో విసిగిన ఆమె బిడ్డతో పుట్టింటికి చేరుకుంది. ఇదే అవకాశంగా గురుసిద్దప్ప పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లో మంజుళ అనే ఆమెను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుని మరోచోట కాపురం పెట్టాడు. ఆ తర్వాత సుధా అనే యువతిని వలలో వేసుకుని ఆమెకూ మూడుముళ్లు వేశాడు. ఇతని లీలలు తెలియడంతో మొదటి, రెండవ భార్యలు న్యాయం చేయాలని విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమలాగ ఎవరూ మోసపోరాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment