బంజారాహిల్స్: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 58లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు ఇంట్లోకి ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఓ యువకుడు ప్రవేశించి ఆయన కూతురు నవ్య బెడ్రూంలోకి వెళ్లి ఆమె మెడపై కత్తి పెట్టి రూ. 25 లక్షలు డిమాండ్ చేశాడు. గదిలోకి వచి్చన ఆమె తల్లి లీలను కూడా బెదిరించాడు. తన భర్తకు ఫోన్ చేసిన బాధితురాలు రూ. 8 లక్షలు తెప్పించి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు నిందితుడికి ఇవ్వడంతో పాటు తన సెల్‌ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం సెల్‌ఫోన్ ఆధారాలు మాత్రమే ఉండగా నిందితుడి కోసం పోలీసులు సాంకేతికతను వినియోగించారు.
అదే రోజు మధ్యాహ్నం షాద్‌నగర్‌కు వెళ్లిన నిందితుడు తన కదలకలను పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు నాలుగైదు గంటలు అక్కడే గడిపి తిరిగి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. ఆ తెల్లవారే దొంగిలించిన డబ్బులో నుంచి రూ. 2.50 లక్షలు వెచి్చంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ నిందితుడు శుక్రవారం ఉదయం శామీర్‌పేట్‌లోని ఓ ఫామ్ హౌజ్‌లో స్నేహితులకు విందు ఇస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితుడు రెజిమెంటల్ బజార్‌లో నివసించే మోతిరాం రాజేష్ యాదవ్ (27)గా తేలింది.
తన ఇంట్లో అప్పులతో పాటు తన జల్సాలకు డబ్బుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్లు సమాచారం. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. చోరీ చేసిన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిందితుడు జూబ్లీహిల్స్‌లోని ఏదైనా ఓ ఇంట్లోకి దూరి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లాలనే పథకంతో రోడ్ నెం 52లో తిరుగుతుండగా ప్రతి ఇంటి ప్రహరీ గోడ ఎత్తుగా ఉండటంతో లోపలికి దూకడం కష్టతరమైంది. ఒక్క ఎన్‌ఎస్‌ఎన్ రాజు నివాస ప్రహరీ మాత్రమే చిన్నగా ఉండటంతో ఆ ఇంటిని ఎంపిక చేసుకొని పక్కా ప్రణాళికతో ఇంట్లోకి దూరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment