MLA Akbaruddin Relative Doctor Mazaruddin Commit Suicide At Jubilee Hills Hyderabad - Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వియ్యంకుడి ఆత్మహత్య

Published Mon, Feb 27 2023 4:26 PM | Last Updated on Tue, Feb 28 2023 3:09 AM

Doctor And MLA akbaruddin Relative Suicide At Jubilee Hills Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌ (60) తన లైసెన్స్‌డ్‌ పిస్టల్‌తో కాల్చుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన ఇంట్లోనే ఈ ఉదంతం జరిగింది. ఆర్థిక, కుటుంబ వివాదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మజారుద్దీన్‌ ప్రస్తుతం ఒవైసీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ విభాగం డీన్‌గా పనిచేస్తుండగా.. ఆయన కుమారుడు అబేద్‌ అలీఖాన్‌ అదే హాస్పిటల్‌లో పీడియాట్రిక్‌ సర్జన్‌గా ఉన్నారు. అబేద్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ కుమార్తె యాస్మిన్‌ ఒవైసీతో 2020 సెప్టెంబర్‌ 22న వివాహమైంది. మజారుద్దీన్‌ ఇంట్లో భార్య అఫియా రషీద్‌ అలీఖాన్, అబేద్, యాస్మిన్‌ ఉంటుండగా.. మజారుద్దీన్‌ కుమార్తె జైనా అలీఖాన్‌ అమెరికాలో నివసిస్తున్నారు.

ఆర్థిక, కుటుంబ వివాదాల నేపథ్యంలో కొన్నాళ్లుగా మజారుద్దీన్, అఫియా మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో వారు ఒకే ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. రెండు రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం తన గదిలోకి వెళ్లిన మజారుద్దీన్‌ తలుపులు గడియపెట్టుకున్నారు. ఆపై తన వద్ద ఉన్న .32 క్యాలిబర్‌ లైసెన్స్డ్‌ పిస్టల్‌తో కుడివైపు చెవి పైభాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గది పూర్తిగా మూసి ఉండటంతో శబ్దం ఎవరికీ వినిపించలేదు. మజారుద్దీన్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి రాకపోవడంతో అబేద్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ ఎత్తకపోవడంతో తాజుద్దీన్‌కు ఫోన్‌ చేసి విషయం ఆరా తీయాలని సూచించారు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో తాజుద్దీన్‌ వెళ్లి మజారుద్దీన్‌ గది తలుపు తట్టినా ఎంతకీ తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా మజారుద్దీన్‌ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటం గమనించాడు.

వెంటనే మజారుద్దీన్‌ భార్య, పనిమనిషుల సాయంతో తలుపులు తీసి మజారుద్దీన్‌ను కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తూటా మజారుద్దీన్‌ తల నుంచి బయటకు దూసుకెళ్లి గోడకు తలిగినట్లు గుర్తించారు.

ఘటనాస్థలి నుంచి తూటా, ఖాళీ క్యాట్రిడ్జ్‌ను క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. డాక్టర్‌ మజహర్‌ అలీ మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement