ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ | Kidnapping of a baby in a government hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ

Published Mon, Jul 15 2024 4:09 AM | Last Updated on Mon, Jul 15 2024 4:09 AM

Kidnapping of a baby in a government hospital

బందరు జీజీహెచ్‌లో ఘటన

నర్సు వేషంలో వచ్చి 5 రోజుల శిశువును అపహరించిన మహిళ

నిందితురాలిని గుర్తించిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌

అతనిచ్చిన సమాచారంతో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు

తల్లి చెంతకు క్షేమంగా శిశువు..  

మచిలీపట్నం టౌన్‌: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపో­గానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 

9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. 

వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. 

సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ సమాచారంతో..
కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్‌ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్‌ చేసిన మహిళే బెయిల్‌ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూ­పర్‌వైజర్‌ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీ­సులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేక­రించారు. 

గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరు­కుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువు­ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటల­కల్లా పోలీ­సులు శిశు­వును క్షేమంగా తల్లి స్వరూప­రాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూప­రాణి సంతోషం వ్యక్తం చేసింది. 

ఆడబిడ్డ కోసమని..!
నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్‌లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. 

కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్‌ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్‌ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌ తెలిపారు. ఎస్‌ఎన్‌సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్‌ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement