కూకట్‌పల్లి (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అతివేగంగా కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై మహిపాల్‌రెడ్డి మంగళవారం మృతి చెందారు. గత శనివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన టాక్సీ కారు మహిపాల్‌రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయన్ను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న మహిపాల్‌రెడ్డి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వివరాలు.. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న కేపీహెచ్‌బీ ఏఎస్‌ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు.
సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు.
కిస్మత్‌పూర్‌లో అంత్యక్రియలు:
ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందడంతో ఆయన స్వస్థలం కిస్మత్‌పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిపాల్‌రెడ్డి కిడ్నీలు, లివర్‌ను అవయవదానం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం కిస్మత్‌పూర్‌తోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. అంత్యక్రియల్లో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహిపాల్‌రెడ్డి భౌతికకాయానికి అడిషనల్ డీజీపీ సజ్జనార్ నివాళులర్పించారు.
చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామంటూ.. రూ.3 కోట్ల మోసం
Comments
Please login to add a commentAdd a comment