
సాక్షి, కర్నూలు : సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం కర్నూలు జిల్లా లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నారాయణరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్‌కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడడంతోపాటు నకిలీ వీడియోను ప్రదర్శించారని.. దాన్ని తన ట్విట్టర్‌లోనూ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం అనని మాటలను అన్నట్లు మార్ఫింగ్ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు.