అన్యాయంగా చంపేశారంటున్నకుటుంబ సభ్యులు
అంతర్గత విషయాలు బయటకొస్తాయనే
హత్య చేశారని ఆరోపణ
న్యూఇందిరానగర్‌లో విషాదఛాయలు
సాయిబాబానగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
కాప్రా: విప్లవం కోసం ఉద్యమంలోకి వెళ్లిన మహిళా మావోయిస్టు పల్లెపాటి రాధ అలియాస్ బంటి రాధ అలియాస్ నీల్సో జీవితం విషాదాంతంగా ముగిసింది. కాప్రా సర్కిల్, న్యూ ఇందిరానగర్‌కు చెందిన రాధ డిప్లొమో ఇన్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ పూర్తి చేసింది. అనంతరం విప్లవంపై ఆకర్షితురాలై అడవిబాట పట్టిన రాధ తిరిగి విగతజీవిగా ఇంటికి చేరింది.
ఇన్‌ఫార్మర్ నెపంతో సహచర మావోయిస్టులే ఆమెను హత్య చేశారు. ఓ మహిళా మావోయిస్టును తోటి మావోయిస్టులే హతమార్చడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, చెన్నాపురం అటవీప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాధ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గురువారం ఉదయం రాధ భౌతికకాయాన్ని ఇందిరానగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కుమార్తె విగత జీవిగా తిరిగి ఇంటికి చేరడంతో తల్లిదండ్రుల రోధనలతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. సాయిబాబానగర్‌లోని శ్మశానవాటికలో రాధ అలియాస్ నీల్సో దహన సంస్కరాలు పూర్తి చేశారు.
అన్యాయంగా చంపేశారు
మావోయిస్టుల అంతర్గత విషయాలు బయటకొస్తాయనే రాధను అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విప్లవ బాటపట్టిన మావోయిస్టుల్లోనూ అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు అనే తారతమ్యం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే రాధను సహచర మావోయిస్టులు చంపేశారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల్లో కొందరు చేసిన తప్పులను రా«ధ ప్రశ్నించిందని, వారి గుట్టు బయటపడుతుందనే భయంతోనే చంపేశారని చెబుతున్నారు.
రాధ ఇన్‌ఫార్మర్‌గా మారిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చింది, మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి తప్పిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రాధ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దళిత మహిళ అనే వివక్ష
ఒక దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే మా చెల్లెను అన్యాయంగా చంపేశారు. ఇన్‌ఫార్మర్ నేపంతో సహచర మావోయిస్టులే చంపి రోడ్డుపై పడేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తే మృతదేహం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఏరియా ఆస్పత్రికి మేం వెళ్లేసరికే రాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అసలు తల్లిదండ్రులు లేకుండా వారికి సమాచారం అందించకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాధ మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేస్తారు. – లింగం, రాధ అన్నయ్య.
నా బిడ్డను చూస్తా అనుకున్నా
మూడు రోజుల్లో నా బిడ్డ ఇంటికొస్తుందని తెలిసింది. చాలా ఏళ్ల తర్వాత నా బిడ్డను చూస్తా అనుకున్నా. అంతలోనే రెండు రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. బిడ్డ ఇక లేదని తెలియడంతో చివరి చూపుకోసం బుధవారం మధ్యాహ్నం అక్కడికి బయలుదేరాం. మేం వెళ్లేసరికే పోస్టుమార్టం పూర్తి చేశామని చెప్పి,మృతదేహాన్ని అప్పగించేశారు. ఇన్‌ఫార్మర్ పేరుతో నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. నా కొడుకుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. –పోచమ్మ(బాలమ్మ), రాధ తల్లి
ఇన్‌ఫార్మర్ అనడం అబద్ధం
మా అక్క రాధను ఇన్‌ఫార్మర్ అని చెప్పడం పచ్చి అబద్ధం. ఆరేళ్ల క్రితం మావోయిస్టుల పార్టీలో చేరిన అక్క ఫ్యామిలీ గుర్తుకు వచ్చినప్పుడు కేవలం మెసేజ్ మాత్రం చేసేది. అది కూడా ఆమె వెళ్లిన తర్వాత రెండేళ్ల క్రితం ఒక్క మెసేజ్ చేసింది. ఎలా ఉన్నారు, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అని ఆరా తీసింది. మేం బాగానే ఉన్నాం, నువ్వు ఇంటికి రావొచ్చు కదా అంటే నన్ను మర్చిపోండి, నేను మావోయిస్టుల్లోనే ఉంటానని చెప్పింది.
అలాంటి మా అక్క ఇన్‌ఫార్మర్ అని ముద్ర వేసి అన్యాయంగా చంపేశారు. ఆ తర్వాత ఈ నెల 18న నాకు మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చేసింది మా అక్క కాదని గుర్తించా. అక్కకు ఏం జరిగిందోననే భయంతో మాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీశా. ఆ తర్వాతి రోజునే చనిపోయిందని తెలిసింది.
ఈ నెల 21న చనిపోయిందని ఫొటో వాట్సాప్ చేశారు. కానీ ఆ ఫొటోలో 19వ తేదీ కనిపించింది. అంటే మా అక్క చనిపోయిన తర్వాత రెండు రోజులకు మాకు సమాచారం అందింది. నాకు డబ్బులు పంపేదని ఆరోపిస్తున్నారు. అలా అయితే నేను క్యాబ్ డ్రైవర్‌గా ఎందుకు పని చేస్తాను. –సూర్యప్రకాష్, రాధ తమ్ముడు
Comments
Please login to add a commentAdd a comment