IPS Officer Rashmi Shukla: రష్మీశుక్లాను అరెస్టు చేయం | Maharashtra Cops We Would Not Arrest IPS Officer Rashmi Shukla | Sakshi
Sakshi News home page

IPS Officer Rashmi Shukla: రష్మీశుక్లాను అరెస్టు చేయం

Published Sat, May 8 2021 6:55 AM | Last Updated on Sat, May 8 2021 8:33 AM

Maharashtra Cops We Would Not Arrest IPS Officer Rashmi Shukla - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రకు చెందిన ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సౌత్‌జోన్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రష్మి శుక్లాను అరెస్టు చేయబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. గతంలో ఈమె మహారాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం కమిషనర్‌గా విధులు నిర్వర్తించగా,  ప్రస్తుతం చాంద్రాయణగుట్టలోని సీఆర్పీ­ఎఫ్‌ సౌత్‌ జోన్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి నేతృత్వం వహించిన సమయంలో రష్మి మొత్తం 36 మంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్పటి వరకు ఆమెకు రెండు నోటీసులు జారీ చేశారు. ముంబై వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రష్మిశుక్లా సదరు ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఆర్డర్‌ ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది.  ఈ కేసు విచారణలో భాగంగా ఆ రాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర సర్కారుతో పాటు ముంబై పోలీసులకూ నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 14న ఈ కేసు విచారించేలా వాయిదా వేసింది. హైకోర్టు నోటీసులపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

కేసు తదుపరి విచారణ వరకు రష్మి శుక్లను అరెస్టు చేయమని, వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె ముంబై రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. త్వరలో ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల బృందమే హైదరాబాద్‌కు వెళ్లి ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేస్తుందని తెలిపింది. గత ఏడాది ముంబై పోలీసు విభాగంలో బదిలీలకు సంబంధించి పైరవీలు చేస్తూ ప్రముఖులు సాగించిన బేరసారాలను రష్మి ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా రికార్డు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులోనూ ఈ ఆడియోలు కీలకంగా మారాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఆడియో రికార్డుల్ని పరిశీలించాల్సి ఉందంటూ,  సీబీఐ అధికారులు ముంబైలోని స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆడియోలతో కూడిన సీడీ ఇప్పించాల్సిందిగా అందులో కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చివెళ్లిన సీబీఐ ప్రత్యేక బృందం రష్మి వాంగ్మూలం నమోదు చేసింది.
చదవండి: తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement