ప్రతీకాత్మక చిత్రం
ఆనందపురం (భీమిలి): క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. భార్యాభర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు తారాస్థాయికి చేరి హత్యకు పురిగొల్పాయి. పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది. మండలంలోని శొంఠ్యాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన హత్య ఘటన రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన పంతుల సూర్య తీర్ధ ప్రసాద్ 20 ఏళ్ల కిందట మండలంలోని శొంఠ్యాం గ్రామానికి వలస వచ్చారు. ఆయనకు విశ్వనాథశాస్త్రి అనే కుమారుడు, వెంకట లలితాదేవి(35) అనే కుమార్తె ఉన్నారు. కాగా వెంకట లలితాదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. మళ్లీ ఎనిమిదేళ్ల కిందట విజయనగరానికి చెందిన ఆండ్ర రవికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది.
అప్పటి నుంచి భర్త, కుమారుడుతో వెంకట లలితాదేవి శొంఠ్యాంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడే వారని స్థానికులు అంటున్నారు. శనివారం ఆ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజునాడు కూడా భర్త తనకు అచ్చటా, ముచ్చటా చూడలేదని సరదాగా కనీసం బయటకు కూడా తీసుకెళ్లలేదని వెంకట లలితాదేవి భర్తతో గొడవ పడింది. ఇంటి వద్దే ఉన్న వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని ఆపుకోలేని రవికుమార్ సుత్తితో లలితాదేవి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన జరిగిన తర్వాత రవికుమార్ పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment