
లక్నో: వ్యవసాయ పొలంలో కంచె తొలగించిన కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదాన్‌లో శనివారం సాయంత్రం జరిగింది. రిషిపాల్ (68) తన పొలంలో బోరుబావి తవ్వించుకున్నాడు. దానికి మోటారు బిగించేందుకు ఓ సిమెంట్ నిర్మాణం అవసరమైంది. ఆ నిర్మాణం కోసమని తన తమ్ముని పొలం గుండా ఓ ట్రాక్టర్‌లో సామాగ్రి తీసుకొచ్చాడు. ట్రాక్టర్ రావడంతో అతని పొలానికి చెందిన ఫెన్సింగ్ (కంచె) కొద్దిగా ధ్వంసమైంది. ఈ విషయమై రిషిపాల్‌తో అతని తమ్ముడు, తమ్ముని కొడుకు గొడవకు దిగారు. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రిషిపాల్‌పై వారిద్దరూ కర్రలతో దాడిచేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిషిపాల్ ప్రాణాలు విడిచాడని జిల్లా ఎస్పీ సిద్ధార్థ వర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.