సాక్షి,పరవాడ (విశాఖపట్నం): వివాహితతో అదృశ్యమైన ఓ యువకుడు హతమయ్యాడు. సుమారు 6 నెలల కిందట కనిపించకుండా వెళ్లిపోయిన పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (23) గత ఏడాది జూలై 13న హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. నడుపూరు సమీప రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన పుచ్చా వంశీ(20), కొవురు సందీప్‌రెడ్డి(20) హత్య చేశారని తేలడంతో అనకాపల్లి కోర్టులో గురువారం హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు మీడియాకు వెల్లడించారు. (చదవండి: ఫోన్‌లో పరిచయం.. తరచూ మాట్లాడుతూ మరింత దగ్గరయ్యి.. )
భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం
వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన అఖిలేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల కిందట స్వాతి అనే వివాహితను తీసుకొచ్చేసి గాజువాక పరిధి నడుపూరు సమీప రామచంద్రానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేవాడు. అదే గ్రామంలో ఇద్దరు పిల్లలు, భర్తతో నివసిస్తున్న సంతోషి లక్ష్మి, స్వాతి డ్వాక్రా గ్రూపులో సభ్యులు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో భార్య స్వాతి స్నేహితురాలు సంతోషి లక్ష్మిని అఖిలేష్ పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. అనంతరం గత ఏడాది మార్చిలో ఆమెను తీసుకుని అనకాపల్లి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పద్మనాభం వెళ్లిపోయి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెతో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో సంతోషి లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మల్కాపురంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సంతోషి బావ రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు పుచ్చా వంశీ (20), కొవురు సందీప్‌రెడ్డి (20) కలిసి అఖిలేష్‌ను పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వాతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి
వివాహితను తీసుకుని వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ నెలలు గడుస్తున్నా తెలియకపోవడంతో అనుమానించిన అఖిలేష్ తండ్రి వియ్యపు ముత్యాలునాయుడు గత ఏడాది నవంబరు 19న పరవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సంతోషి లక్ష్మి బంధువులపై నిఘా ఉంచి కాల్ డేటా పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సనా వాసు, పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని హత్యా స్థలికి తీసుకెళ్లగా... అక్కడ మృతుని ప్యాంటు, పుర్రె, ఎముకలు లభించాయి. వాటి ఆధారంగా మృతుని గుర్తించడంతో నిందితులను రిమాండ్‌కు తరలించారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసును సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ పి.రమేష్ ఛేదించారు.
తీరు మారకపోవడంతో హత్య
పోలీసులు కౌన్సెలింగ్ చేసినా, బంధువులు హెచ్చరించినా అఖిలేష్ తీరులో మార్పు రాలేదు. మళ్లీ గత ఏడాది జూన్‌లో సంతోషి లక్ష్మిని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత 2021 జూలై 13న తాను గతంలో కాపురం పెట్టిన పద్మనాభం వచ్చాడు. అక్కడి అద్దె ఇంటిలోని సామగ్రి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా... విషయం తెలుసుకున్న సంతోషి లక్ష్మి బావ సనా వాసు, అతని స్నేహితులు పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సంతోషి లక్ష్మి ఎక్కడ ఉందని వాకబు చేశారు. తనకు తెలియదని అఖిలేష్ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించగా... బయట మాట్లాడుకుందామని చెప్పి అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో అఖిలేష్‌ను వాసు తన ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరాడు. మరో ద్విచక్ర వాహనంపై వంశీ, సందీప్‌రెడ్డి బయలుదేరి... ముందుగా వేసుకొన్న ప్రణాళిక ప్రకారం ఆనందపురం మండలంలోని నీళ్ల కుండీలు కూడలి సమీప నిర్మాణుష్య ప్రదేశానికి అఖిలేష్‌ను తీసుకెళ్లి హతమార్చారు. బండరాయితో ముఖం గుర్తు పట్టలేని విధంగా మోదారు. అనంతరం రక్తం వాసనను పోలీసులు, పరిసర ప్రాంతీయులు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టును హతుడి శరీరంపై పూసి తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment