Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని | Man Assassinated Woman Husband At Film Nagar Over Love Affair | Sakshi
Sakshi News home page

Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని

Published Wed, Jan 17 2024 2:36 PM | Last Updated on Wed, Jan 17 2024 4:04 PM

Man Assassinated Woman Husband At Film Nagar Over Love Affair - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫిలింనగర్‌లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్‌ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్‌పేట సమీపంలోని జైహింద్‌నగర్‌ కాలనీలో నివసించే గౌస్‌ మొహినుద్దీన్‌ పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి దుబాయ్‌లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు.

ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్‌ మొహినుద్దీన్‌ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్‌ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్‌ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్‌లో ఉంది.

ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన అద్నాన్‌ హుస్సేన్‌ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగివచ్చింది. గత నవంబర్‌ 14న అద్నాన్‌పై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్‌పై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్‌ లండన్‌ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్‌ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్‌ మొహినుద్దీన్‌ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్‌పై తన ఇంటికి వచ్చాడు.

అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్‌ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్‌ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్‌ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్‌ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్‌ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement