సాక్షి, చెన్నై: విడాకుల నోటీసు పంపించిన భార్యను కిరాయి ముఠా ద్వారా హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ భర్త కిరాతకం తిరువారూర్‌లో వెలుగు చూసింది. కిడారి కొండం గ్రామానికి చెందిన చిదంబరం కుమార్తె జయభారతికి ఆరేళ్ల క్రితం తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విష్ణుప్రకాష్‌తో వివాహం అయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. భర్త వేధింపులు తాళలేక ఏడాది క్రితం అతి కష్టమ్మీద అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు, పాపను జయభారతి చూసుకుంటోంది.
రెండు రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి స్కూటర్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గంటల పాటు రోడ్డుపై ఆగి ఉండడం, జయభారతి వాహనాన్ని అతివేగంగా ఢీకొనడం దృశ్యాలను గుర్తించారు. విచారణలో తిరువారూర్‌లోని ఓ సంస్థ నుంచి కుంభకోణానికి చెందిన ఓ వ్యక్తి వాహనాన్ని అద్దెకు తీసుకెళ్లినట్టు తేలింది.
అతడిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెలన్నర క్రితం జయభారతి విడాకుల నోటీసు పంపడంతో విష్ణుప్రకాష్ ఉద్యోగానికి ఎసరు తప్పలేదు. దీంతో కుంభకోణంలోని సమీప బంధువు ద్వారా కిరాయి ముఠాను సంప్రదించి జయభారతిని హతమార్చేందుకు పథకం రచించాడు. హత్య కేసుగా మార్చిన పోలీసులు విష్ణు ప్రసాద్‌ను ఇండియాకు పంపించాలని అమెరికాలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం పంపించారు.
చదవండి: Tamil Nadu: కరోనాతో నర్సు మృతి
Comments
Please login to add a commentAdd a comment