ఉన్మాది సునీల్ (ఫైల్)
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: అతనో ప్రేమోన్మాది.. తనను ప్రేమించాలంటూ ఆ యువతిని మూడు నెలలుగా వేధించేవాడు.. అతను కనిపిస్తే చాలు పాపం యువతి భయంతో వణికిపోయేది.. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోలేదు.. నా ప్రేమనే తిరస్కరిస్తావా అంటూ అతను యువతి ఇంటికి వెళ్లి కత్తితో కర్కషంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆరోగ్యం విషమంగా మారింది. పట్టణంలోని నేతాజినగర్‌లో శుక్రవారం జొల్లు లావణ్య అనే యువతిపై సునీల్ అనే ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదనే కారణంతో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనివాసులు ప్రొద్దుటూరులోని నేతాజినగర్–3లో నివాసం ఉంటున్నాడు. కొత్త మార్కెట్‌లో కోడిగుడ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు.
తనతో పాటు భార్య భారతి వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు లావణ్యతో పాటు మరో కుమార్తె ఉంది. లావణ్య ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. విజయవాడలోని ఒక కళాశాలలో బి–టెక్ చేర్పించాలనుకున్నారు. ఆదివారం లావణ్య విజయవాడకు వెళ్లాల్సి ఉంది. లావణ్య ఇంట్లో ఒంటరిగా ఉండగా.. పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన సునీల్ అనే యువకుడు లావణ్యను మూడు నెలలుగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేసేవాడు. అయితే యువతి అందుకు తిరస్కరించడంతో అతను ఉన్మాదిగా మారాడు. సునీల్ ఎక్కడైనా బజారులో కనిపిస్తే చాలు లావణ్య భయంతో వణికిపోయేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ దుకాణానికి వెళ్లారు.
లోపల గడియ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలంటూ కుమార్తెకు చెప్పారు. దీంతో లావణ్య బయట గేట్‌కు తాళం వేసి, ఇంటి లోపల గడియ పెట్టుకుంది. శ్రీనివాసులు దంపతులిద్దరూ దుకాణంలో ఉన్నారని గ్రహించిన సునీల్ నేరుగా నేతాజినగర్‌కు వెళ్లాడు. తలుపు తట్టడంతో ఎవరో వచ్చారని యువతి తలుపు తీసింది. వెంటనే అతను ఇంట్లోకి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిలో చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. చేతి వేళ్లు తెగి కింద పడ్డాయి. కత్తిని అక్కడే వదిలేసి ఉన్మాది సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు హుటా హుటినా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.
మూడు నెలలుగా టార్చర్ పెడుతున్నాడు..
కుమార్తెపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రక్తంలో తడిసి ముద్దయిన లావణ్యను చూసి తల్లి భారతి విలపించసాగింది. ‘మూడు నెలల నుంచి సునీల్ నా బిడ్డను వేధిస్తున్నాడు.. అతనంటే ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు.. రోజూ ఇద్దరు, ముగ్గురు స్నేహితులను వెంట పెట్టుకొని వీధిలోకి వచ్చేవాడు.. వాడిని వదిలి పెట్టకండి సార్..’అంటూ ఆమె ఆస్పత్రి బయట రోదిస్తోంది. సునీల్ వేధిస్తున్నాడని పలు మార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రత్యేక బృందాలతో సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
రిమ్స్‌లో లావణ్యను పరామర్శించిన ఐసీడిఎస్ అధికారులు
కడప అర్బన్: ప్రేమోన్మాది సునీల్ చేతిలో దాడికి గురైన బిటెక్ విద్యార్థిని లావణ్యకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు శుక్రవారం ప్రొద్దుటూరు నుంచి కడప రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమెను ఐసీడీఎస్ పీడీ పద్మజ, తమ సిబ్బందితో కలిసి పరామర్శించారు. విద్యార్థిని తల్లిదండ్రులు శ్రీనివాసులు, భారతిని అడిగి విషయం తెలుసుకున్నారు. వైద్యపరంగా, చట్టపరంగా తాము అండగా ఉంటామని వారు విద్యార్థినికి, తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నిర్మలాదేవి, ఒన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎన్. అశ్విని, ఎస్‌ఐ కమాల్‌బీ, డిసిపిఓ సుభాష్‌యాదవ్, పిఓ కమల్‌కుమార్‌లు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు జయచంద్ర, ఏపి మహిళా సమాఖ్య నగర కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉమాదేవి, ఏఐఎస్‌ఎఫ్ నగర నాయకులు శివశంకర్ తదితరులు లావణ్యను పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కిరాతకుడు సునీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment