సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి తన క్లాస్‌మేట్‌ను పెళ్లి పేరుతో ట్రాప్ చేశాడు. సౌదీలో వ్యాపారం ప్రారంభిస్తున్నానంటూ 2019లో రూ.6 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మాటల గారడీ చేస్తూ వచ్చాడు. మధ్యలో రూ.లక్ష తిరిగి చెల్లించాడు. చివరికి తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
పెళ్లి పేరుతో అందినంత దోచుకుని..
నగరానికి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం బ్యాంకు పరీక్షల కోసం సిద్ధమవుతూ వరంగల్‌లోని ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంది. అప్పట్లో ఈమెతో పాటే కోచింగ్ తీసుకున్న ఓ యువకుడు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. 2019లో సోషల్‌మీడియా ద్వారా ఈమెను సంప్రదించిన అతగాడు తాను ఫలానా అంటూ పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఇరువురూ కొన్నాళ్లు కాల్స్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తాను సౌదీ అరేబియాలో ఉంటున్నానని, తిరిగి వచ్చాక వివాహం చేసుకుందామని నమ్మించాడు.
సౌదీలోనే వ్యాపారం మొదలెడతానంటూ రూ.6 లక్షలు అడిగాడు. ఈ మొత్తం ఇవ్వడానికి యువతి అంగీకరించింది. ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇదిగో వస్తా... అదిగో వస్తా.. అంటూ యువతితో చెబుతూ వచ్చాడు. బాధితురాలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో రూ.లక్ష ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం పంపకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ ఎస్.నవీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment