ప్రతీకాత్మక చిత్రం
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): అమాయకులైన యువతులే అతని టార్గెట్.. పెళ్లి పేరుతో వారికి ఆశల వలవేసి నగదు దోచుకోవటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.. అతని మాయమాటలు నమ్మి నరసరావుపేటకు చెందిన యువతి భారీ మొత్తంలో నగదును కోల్పోయింది. వివరాలలోకి వెళితే.. రామిరెడ్డిపేటకు చెందిన యువతికి గతంలో వివాహం కాగా భర్తతో విడాకులు పొందింది. మరో వివాహం చేసుకునేందుకు జీవన్‌సాథీ మ్యాట్రిమోని ద్వారా ప్రయత్నించే క్రమంలో వైజాగ్‌కు చెందిన కొచ్చర్ల శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది.
చదవండి: ప్రియుడితో పరార్.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివాహం చేసుకుని అమెరికా వెళ్దామని నమ్మించాడు. వీసా పొందాలంటే ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉండాలని యువతిని నమ్మబలికాడు. ఆమె తన ఖాతా ద్వారా శ్రీకాంత్ చెప్పిన అకౌంట్‌కు విడతల వారీగా రూ.48 లక్షలు బదిలీ చేసింది. పెళ్లి చూపులకు కుటుంబసభ్యులతో కలసి వస్తానని చెప్పి రాకుండా కాలయాపన చేస్తున్నాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవటంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విష యం వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు శుక్రవారం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.
వెలుగులోకి నిత్య పెళ్లి కొడుకు లీలలు
నిందితుడి ఫోన్ నంబరు ఆధారంగా అతని కోసం వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. శ్రీకాంత్ పేరుతో ఫేక్ ఐడీ సృష్టించటంతో పాటు తన ఫొటోను మార్చి మ్యాట్రిమోనీ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. మ్యాట్రిమోని ద్వారా పరిచయం చేసుకుని ఇదే తరహాలో ప్రకాశం జిల్లాకు చెందిన యువతిని మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇటీవల అరెస్టు చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment