
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : ప్రేమించినోడితో కుమార్తెకు పెళ్లి చేసిందన్న ఆగ్రహంతో భార్యను భర్త అతి దారుణంగా హతమార్చి దహనం చేశాడు. తూత్తుకుడిలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. తేరువాయిపురం పోలీసుల కథనం మేరకు తూత్తుకుడి జిల్లా నటరాజపురానికి చెందిన మునుస్వామి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, రెండు రోజుల క్రితం పెద్ద కుమార్తె సమీప గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
ఇది మునుస్వామికి పెద్ద షాక్‌గా మారింది. మరో యువకుడితో ప్రేమ అంటూ పెళ్లి చేసుకొచ్చిన కుమార్తె మీద ఆగ్రహాన్ని ప్రదర్శించి ఆమెను బయటకు గెంటేశాడు. అయితే, వీరి వివాహం తన భార్య లక్ష్మి సమక్షంలో జరిగినట్టుగా మునుస్వామి గ్రహించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం వేకువజామున తూత్తుకుడి జిల్లా కొళత్తూరు సమీపంలోని దురైస్వామి పురం ఆలయ దర్శనానికి అంటూ భార్యను వెంటబెట్టుకెళ్లాడు. అక్కడ అటవీ ప్రాంతంలో ఆమెను హతమార్చి, ఎవరూ గుర్తుపట్టని రీతిలో దహనం చేసి ఉడాయించాడు. ఎస్పీ జయకుమార్, విలాతి కులం డీఎస్పీ ప్రకాశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment