సాక్ష, బంజారాహిల్స్: భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామలు కొట్టడమే కాకుండా అవమానానికి గురి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెయింటర్‌గా పని చేస్తూ.. బోరబండ రాజీవ్‌గాంధీనగర్ సమీపంలోని టి.అంజయ్యనగర్‌లో నివసించే దుష్ముక్ లక్ష్మణ్ (26)కు తెల్లాపూర్‌లో నివసించే స్వప్న(20)తో వివాహం జరిగింది.
అప్పటికే ఆ యువతికి తనకంటే రెట్టింపు వయస్సున్న వ్యక్తితో పెళ్లి కావడంతో విడిపోయారు. తరచూ గాజులరామారంలో ఉండే తన అత్త ఇంటికి వెళ్తున్న లక్ష్మణ్‌కు ఓ రోజు ఈ స్వప్న కనిపించగా పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల పాటు అంజయ్యనగర్‌లో కాపురం చేసిన వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తతో నిత్యం గొడవ పడుతుండటంతో కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. లక్ష్మణ్ కూడా అత్తారింటికి వెళ్లాడు.
ఈ నేపథ్యంలోనే పనికి సరిగ్గా వెళ్లడం లేదంటూ భార్య, భర్తల మధ్య గొడవలు వచ్చాయి. నెల రోజుల క్రితం లక్ష్మణ్ దంపతులకు పాప జన్మించింది. గత నెల 31వ తేదీన లక్ష్మణ్ తన కుమార్తె 21 రోజుల ఫంక్షన్ కోసం అత్తగారింటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి అత్తింట్లో లక్ష్మణ్‌కు అవమానంతో పాటు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టగా పారిపోయే క్రమంలో పట్టుకొని స్తంభానికి కట్టేసి మళ్లీ కొట్టారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున మూత్రవిసర్జన పేరుతో అత్తింటి నుంచి పారిపోయి సమీపంలోని లింగంపల్లి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
తల్లిదండ్రులు, బంధుమిత్రులు అక్కడికి చేరుకొని లక్ష్మణ్‌ను ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత అంజయ్య నగర్‌కు వచ్చిన లక్ష్మణ్ తన సెల్‌ఫోన్‌ను సోదరుడికి ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ వెళ్లిపోయాడు. 1వ తేదీన వెళ్లిన అతను కనిపించకపోవడంతో అంతటా వెతికారు. అయితే లక్ష్మణ్ ఇంటి సమీపంలో నివసించే చిన్నమ్మ ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో ఆ ప్రాంతమంతా గాలించగా భవనంలోని సెల్లార్‌లో లక్ష్మణ్ మృతదేహం కుళ్లిపోయి వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. లక్ష్మణ్ భార్య పుట్టింటి నుంచి రాకపోవడం, అత్తింటి వేధింపులు, ఆమె కుటుంబ సభ్యుల దాడి నేపథ్యంలోనే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతుడు సోదరుడు శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: బీడీ వెలిగించుకుని పడేసిన అగ్గిపుల్ల.. చూస్తుండగానే ఘోరం
Comments
Please login to add a commentAdd a comment