అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. ఆడపిల్లలు పుట్టారని వెలేశాడంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన మానవతావాదులు ఆమెను కాపాడి జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి వద్దకు పిలుచుకెళ్లారు. బాధితురాలి వేదన ఆమె మాటల్లోనే..
‘నా పేరు మమత. బుక్కపట్నం మండలం కొడపగానిపల్లి. బుక్కపట్నంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామ్మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మాది ప్రేమ వివాహం. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నా భర్త నా నుంచి దూరమయ్యాడు.
బుక్కపట్నంలో తాను పనిచేస్తున్న సచివాలయంలోనే వివాహిత అయిన ఓ ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిలదీయడంతో నాపై పలుమార్లు దాడికి ప్రయత్నించాడు. అతని వేధింపులు తాళలేక 2021, డిసెంబరులో నిర్వహించిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశా. దిశా పోలీసు స్టేషన్‌కు నా భర్తను పిలిపించి మందలించి పంపారు.
అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా ఇంటి ముఖం కూడా చూడడం లేదు. నా తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి.. నన్ను, పిల్లలను పోషించలేక పోతున్నారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించి, నా సంసారాన్ని చక్కబెట్టాలని కోరేందుకు వచ్చా. అయితే నా కష్టం తీరుతుందని అనుకోలేదు.
దీంతో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువులో పిల్లలను తోసి నేనూ దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. నా ప్రయత్నాన్ని అక్కడున్న వారు అడ్డుకుని జాయింట్ కలెక్టర్ సిరి మేడమ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి కదిరి ఆర్డీఓకు ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు’ అంటూ వివరించారు.
బాధితురాలు మమత
Comments
Please login to add a commentAdd a comment