బద్వేలు అర్బన్ : అల్లరి చిల్లరిగా తిరుగుతూ వీధి ప్రజలను ఇబ్బందులు పెట్టే బదులు పద్దతి మార్చుకుని సక్రమంగా జీవించాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను అవమానంగా భావించిన యువకుడు తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. బుధవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివసించే శేషాద్రిరెడ్డి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు.
ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అదే కాలనీలో ఉండే నరసాపురం పోలేరు వంటమాస్టర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ జులాయిగా తిరిగేవాడు. ఇదే సమయంలో వీధిప్రజలతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయంపై గతంలో శేషాద్రిరెడ్డి కూడా పోలేరును మందలించాడు. దీనిని అవమానంగా భావించిన పోలేరు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం ఇంటిలో ఉన్న శేషాద్రిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు.
ఆ సమయంలో అక్కడే ఉండి అడ్డుకోబోయిన శేషాద్రిరెడ్డి కుమారుడు పవన్‌కార్తీక్‌రెడ్డిపై కూడా దాడి చేశాడు. ఈ సమయంలో శేషాద్రిరెడ్డి భార్య పార్వతి గట్టిగా కేకలు వేయడంతో పోలేరు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని గాయపడిన తండ్రి, కొడుకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడు అరెస్టు
పోలేరు ముఖానికి ముసుగు ధరించి ఉండటంతో దాడి చేసింది ఎవరనేది తొలుత అంతుపట్టలేదు. అంతేకాకుండా ముసుగు దొంగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారని పట్టణంలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. ఈ సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో నిందితుడిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. తర్వాత విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment