సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను రద్దు చేయబోతోందంటూ ఓ వ్యాపారిని నమ్మించి రూ.2 లక్షలు కొట్టేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేసిన ఉదంతం యూపీలో వెలుగుచూసింది. ప్రభుత్వం కొత్త రూ.వెయ్యి నోట్లను ముద్రించిందని వ్యాపారిని నిందితుడు నమ్మబలకడంతో బాధితుడు... రూ.2 లక్షలు(రూ.2 వేల నోట్లు) ఇచ్చి ఆర్‌బీఐ ముద్రించిన కొత్త వెయ్యి నోట్లు ఇవ్వాలని కోరాడు. ఆ డబ్బుతో నిందితుడు ఉడాయించినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని లాహోరీ గేట్ నయా బజార్‌లోని ఓ షాపు వద్దకు వచ్చిన నిందితుడు తన మాటలతో దుకాణ యజమానిని నమ్మించాడు. చదవండి : మహిళా జర్నలిస్ట్ సాహసం..
నిందితుడి మాటలు నమ్మిన వ్యాపారి రూ.2 లక్షలు విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని నిర్ణయించారు. తన వద్ద పని చేసే విష్ణుదత్ అనే వ్యక్తికి నగదు అప్పగించి ఆ అజ్ఞాత వ్యక్తితో వెళ్లమని సూచించారు. అనంతరం ఇద్దరూ కలిసి స్కూటీపై బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక విష్ణుదత్ నుంచి నగదు ఉన్న బ్యాగును ఆ వ్యక్తి తీసుకున్నాడు. ఓ భవనాన్ని చూపించి అందులోకి వెళ్లి రూ.వెయ్యి నోట్లను తీసుకోవాల్సిందిగా సూచించాడు. లోపలికి వెళ్లిన విష్ణుదత్‌కు అక్కడ ఎవరూ కనిపించలేదు. బయటకు వచ్చి చూస్తే... డబ్బుతో సహా ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించినట్టు గుర్తించాడు.
యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం వెలుగుచూసింది. వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్కూటర్ నంబర్ ఆధారంగా సీసీ ఫుటేజీల సాయంతో నిందితుడిని అజయ్ శర్మ(55)గా గుర్తించారు. యూపీలోని షహీదాబాద్ లోని అతని ఇంటి వద్ద పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల రూపాయల నగదుతో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. నిందితుడు ఇటీవల పేకాటలో లక్షల రూపాయలు కోల్పోయినట్టు డీసీపీ ఆల్ఫెన్స్ వెల్లడించారు. ఆ నగదును తిరిగి రాబట్టుకునేందుకే నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment