‘ఘోస్ట్‌’ చందా.. మార్గదర్శి దందా! | Margadarsi Chit Funds illegality Three cases registered with complaints | Sakshi
Sakshi News home page

‘ఘోస్ట్‌’ చందా.. మార్గదర్శి దందా!

Published Mon, Aug 21 2023 4:20 AM | Last Updated on Mon, Aug 21 2023 8:56 AM

Margadarsi Chit Funds illegality Three cases registered with complaints - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న సీఐడీ అదనపు డీజీ సంజయ్‌. చిత్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్‌

సాక్షి, అమరావతి: ఈయన పేరు సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామస్తుడు. బాపట్ల జిల్లా చీరాలలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి కార్యాలయంలో ఓ చిట్టీ గ్రూపులో చందాదారుగా నమోదయ్యారు. ఈయన ఏనాడూ చీరాల మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయానికి వెళ్లలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుగా చేరనే లేదు.

కానీ చీరాల మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయంలో మాత్రం ఆయన్ను చందాదారుగా నమోదు చేయడం గమనార్హం. విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సైన నిజం. దేశంలో ఇంత వరకు ఏ చిట్‌ ఫండ్స్‌ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం.

ఇలా ఎందుకు చేశారంటే..
ఇక్కడ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్‌ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని ‘ఘోస్ట్‌ చందాదారులు’ అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు.

అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది.

ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్‌ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్‌మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్‌ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్‌ మనీ కూడా కొల్లగొడుతోంది. 

ఇలా వెలుగు చూసింది..
మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది.

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్‌ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్‌ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాటు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది.

సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్‌ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఘోస్ట్‌ చందాదారులతో భారీగా అక్రమాలు 
వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్‌ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్‌ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధం.

ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్‌ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్‌ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్‌మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు. 

అప్పుల ఊబిలోకి చందాదారులు
చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.

దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్‌మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది.

కానీ దీన్ని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్‌తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది.

అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్‌మనీ పొందుతున్నారు.

ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. 

వందకుపైగా ఫిర్యాదులు
చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.  అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ 9493174065 కేటాయించింది. 

మూడు చోట్ల చీటింగ్‌ కేసులు నమోదు
చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్‌)లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ తెలిపారు.  

► సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

► అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు.

మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్‌ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

► కోరుకొండ విజయ్‌కుమార్‌ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ మేనేజర్‌ తిరస్కరించారు.

విజయ్‌కుమార్‌ తన స్నేహితుడు మల్లికార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్‌మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.   

మార్గదర్శి ఓ ‘నల్ల’ ఖజానా 
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్‌ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్‌ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది.

శని, ఆదివారాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్‌ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్‌ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్‌బుక్‌లోగానీ వారి పాన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది.

కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను ఆన్‌లైన్‌ ఖాతాల్లో ఎందుకు లింక్‌ చేయలేదని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం హడలెత్తిపోయింది.

ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్‌ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్‌ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్‌ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు.   

చీటింగ్‌కు ‘మార్గదర్శి’గా కడప మేనేజర్‌ 
కడప అర్బన్‌: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. చందాదారులను మోసం చేసి అక్రమార్జనకు పాల్పడటంలో మార్గదర్శి యాజమాన్యమే కాదు.. సంస్థలో కొందరు మేనేజర్లు కూడా సిద్ధహస్తులేనన్న విషయాన్ని ఆ సంస్థ పూర్వపు ఉద్యోగులు వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ వైఎస్‌ఆర్‌ జిల్లాలో కడప బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న డి. శేషుబాబు అక్రమార్జనను వివరిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ విజయవాడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఆయన ఏజెంట్స్‌ కోడ్‌లతో చిట్‌లు భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలివీ.. శేషుబాబు ఆయన సొంత ఏజెంట్‌ వి. శ్రీనివాసులరెడ్డి (ఏజెంట్‌ కోడ్‌ నం: సిపి0000160) కోడ్‌ ద్వారా ఎక్కువ మంది చిట్‌ సభ్యులను చేర్పించారు. ఎన్‌.వి బాలాజీ (ఏజెంట్‌ కోడ్‌ నం. జె0000088), గౌరి (ఏజెంట్‌ కోడ్‌ నం: జె0000167), ఎ.వి మహేష్‌ (ఏజెంట్‌ కోడ్‌ నం: సిపి000077)తో పాటు ఇంకా ఇతర ఏజెంట్‌ కోడ్‌లలో కూడా చిట్‌లు వేసి విపరీతంగా సంపాదించాడు.

తనకు అనుకూలమైన వారికి తక్కువ బిడ్‌ అమౌంట్‌ కేటాయిస్తారు. మిగిలిన వారికి (స్టాఫ్‌) ఎక్కువ బిడ్‌ను మేనేజరే ఇంత అని నిర్ణయిస్తారు. పాట సమయానికి కస్టమర్‌ వచ్చినప్పుడు కూడా బిడ్‌ ఎక్కువగా వచ్చేట్లు ఉద్యోగులతో పాడిస్తాడు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో బంగారం, బెంగళూరులో సొంత ఇల్లు, కడపలో స్థలాలు, అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాటు కూడా కొన్నారు. మిగిలిన మార్గదర్శి ఉద్యోగులను స్టాఫ్‌ కోడ్‌లతో చిట్స్‌ వేయమనీ వేధిస్తాడు.

చెప్పినట్లు చేయకుంటే దుర్భాషలాడతాడు. దీంతో కొందరు సీనియర్‌ స్టాఫ్‌ వేరే సంస్థలకు వెళ్లిపోయారు. శేషుబాబు కొందరు ఖాతాదారులకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లను కూడా అమ్మేసుకున్నారు. ఆయనకు అనుకూలమైన ఉద్యోగులైన శివసతీష్‌, రిసెప్షనిస్టు వరలక్షుమ్మ కూడా ఏజెంట్‌ కోడ్‌లలో వేసుకోవడానికి ప్రాధాన్యత కల్పించాడు.

శివసతీష్‌ చిట్టీ కమీషన్‌ డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత సంపాదిస్తున్నాడు. పాట పాడటానికి ఎవ్వరూ రాకపోతే శేషుబాబు, శివసతీష్‌, వరలక్షుమ్మ కలిసి తక్కువ బిడ్‌ పోతున్నా ఎక్కువ బిడ్‌ పోయేలా చేస్తారు. దీనిద్వారా అసలైన చందాదారులకు వడ్డీ ఎక్కువ పడుతుంది.  కస్టమర్లకు బిడ్‌ వచ్చిన తర్వాత కూడా డబ్బు ఇవ్వడానికి వీరు ఇబ్బందులకు గురిచేస్తారని వారు సీబీఐకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.  

మార్గదర్శి మేనేజర్‌ అరెస్ట్‌
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్‌లో చిట్‌ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్న వైనం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టూ టౌన్‌ పోలీసులు బ్రాంచ్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సౌత్‌ జోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి ఏఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కోరుకొండ విజయ్‌కుమార్‌ మార్గదర్శిలో మోసంపై శనివారం టూటౌన్‌ సీఐ గణేష్‌కు ఫిర్యాదు చేశారు.

విజయ్‌కుమార్‌ మార్గదర్శి చిట్స్‌లో 2019లో రూ.5 లక్షల చిట్‌ వేశారు. 50 నెలల కాల వ్యవధిలో నెలకు రూ.10 వేల చొప్పున చిట్‌కు నగదు చెల్లించాలి. తనకున్న ఆర్థిక అవసరాల రీత్యా ఆయన 2020 జూన్‌ 21వ తేదీన రూ.3 లక్షలకు చిట్‌ పాడారు. చిట్‌ డబ్బులు చెల్లించాల్సిన మార్గదర్శి మేనేజర్, బ్రాంచ్‌ అధికారులు ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇద్దరి ష్యూరిటీ కావాలన్నారు. వాళ్ల కోరిక మేరకే ఇద్దరి ష్యూరిటీ తీసుకువచ్చారు. ఇప్పుడైనా చీటీ డబ్బులు ఇవ్వాలని కోరగా.. మీరు ఇతరులకు ష్యూరిటీ పెట్టారు.

అది క్లియర్‌ చేస్తే మీ చీటీ డబ్బులు ఇస్తామని మేనేజర్‌ సమాధానం చెప్పారు. ష్యూరిటీకి సంబంధించిన డబ్బులు హెడ్‌ కానిస్టేబుల్‌ స్నేహితుడు చెల్లించేశారు. అయినా.. ఇతనికి రావాల్సిన రూ.3 లక్షలు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై హెడ్‌ కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్‌ మేనేజర్‌ సత్తి రవిశంకర్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement