సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/రాజమహేంద్రవరం: చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. షెల్ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై సిట్ మోపిన అభియోగాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది.
చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు.
ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో కూడిన కాన్వాయ్‌తోపాటు ప్రత్యేక బస్‌లో భద్రతా సిబ్బందితోపాటు ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది కూడా అనుసరించారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. మార్గం మధ్యలో కాన్వాయ్‌లోని ఓ వాహనం (చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కాదు) బ్రేక్ డౌన్ అయ్యింది.
దాంతో ఆ వాహనాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది.
అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు.
కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే జైలు లోపలికి వెళ్లిన లోకేష్ తిరిగి కొద్ది సేపటికే బయటకు వచ్చేశారు.
జైలు అధికారుల సమావేశం
చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బాబుకు గది కేటాయింపు మొదలు వివిధ అంశాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఖైదీలకు ఇచ్చే డ్రస్ ఉండదని, మామూలుగా ఆయన ధరించే దుస్తులకు అనుమతిస్తామని చెప్పారు. కాగా, రాజమండ్రిలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.
ఖైదీ నంబర్.. సోషల్ మీడియాలో వైరల్
రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9–9–23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment