రామవరప్పాడు (గన్నవరం): సంతోషాల పొదరిల్లు వారి కుటుంబం.. భార్య, భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం.. అటువంటి సమయంలో కరోనా మహమ్మారి కాటేసింది. ఇంటి పెద్దయిన భర్తను దూరం చేసింది.. తనకు, తన బిడ్డలకు అండగా ఉంటారనుకున్న అత్తింటి వారు ఆమె ఆవేదనను మరింత ఎక్కువ చేశారు. ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనన్న ఆలోచనతో ఆ తల్లిని వేధింపులకు గురిచేశారు. తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక ఇక లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది.
ఓ కెమికల్‌ను ఆన్‌లోనే కొనుగోలు చేసింది. తన ఒక్కతే చనిపోతే.. ఇద్దరు బిడ్డలు అనాథలవుతారని ఆలోచించింది. ఆ కెమికల్‌ను తనతోపాటు, తన బిడ్డలకు పట్టించింది. కళ్లముందే బిడ్డలు చనిపోతుంటే చూడలేకపోయిందో.. లేక చివరిగా తన అక్కతో మాట్లాడాలనుకుందో గానీ విషయాన్ని ఆమె అక్కకు ఫోన్‌లో చెప్పింది. వెంటనే స్పందించిన అక్క హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించింది. ఆ ఘటన విజయవాడరూరల్ మండలం నిడమానూరులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాలు ఇవి..
నిడమానూరు రామానగర్ రామాలయం సమీపంలో సూరెడ్డి బాలకృష్ణ, దివ్య (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భార్గవ్ (7), రోహిత్ (5) సంతానం. బాలకృష్ణ చందు కార్ ట్రావెల్స్‌లో మెనేజర్‌గా పని చేసేవాడు. మూడు నెలల క్రితం కరోనాతో బాలకృష్ణ మృతి చెందాడు. అప్పటి నుంచి దివ్య పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒంటరిగా తనలో తాను కుమిలిపోతుండేది.
అధికమైన అత్తింటి వేధింపులు
ఈ క్రమంలో దివ్యకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. రామానగర్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో దివ్య, ఫస్ట్ ఫ్లోర్‌లో అత్త, సెకండ్ ఫ్లోర్‌లో మరిది ఉంటున్నారు. బాలకృష్ణ మృతి చెందినప్పటి నుంచి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు, తోడికోడలు మల్లీశ్వరి కలిసి దివ్యను వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త చనిపోయినా ఇక్కడెందుకు ఉన్నావు.. పుట్టింటికి వెళ్లిపో అంటూ చీటికీ మాటికీ గొడవ పడుతుండేవారు. భర్త మరణంతో ఆధారం కోల్పోయానని, ఉన్న ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని దివ్య అత్తింటివారిని కోరింది. దీనికి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు నిరాకరించడంతో పిల్లలను ఎలా చదివించాలి, పోషించాలన్న ఆలోచనతో మనోవేదనకు గురైంది.
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దివ్య, భార్గవ్, రోహిత్
అక్కకు విషయం చెప్పడంతో..
అర్ధరాత్రి దాటిన తర్వాత పెనమలూరులో నివాసం ఉంటున్న తన అక్కకు దివ్య ఫోన్ చేసి, తాము చనిపోతున్న విషయాన్ని చెప్పింది. ఆమె వెంటనే స్పందించి బంధువులతో కలిసి దివ్య ఇంటికి వచ్చింది. అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న తల్లీపిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. పిల్లలు రెయిన్‌బో ఆస్పత్రిలో, దివ్య ఆయుష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లలకు ప్రాణాపాయం నుంచి బయట పడగా.. దివ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..
ఒక పక్క భర్త మృతి చెందడం, మరో పక్క అత్తింటి వారి వేధింపులు ఎక్కువవడంతో జీవితంపై విరక్తి చెందిన దివ్య చనిపోవాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే అంశంపై శోధించింది. సోడియం ఎజైడ్ కెమికల్ తాగితే వెంటనే ప్రాణాలు పోతాయని తెలుసుకుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారన్న ఉద్దేశంతో శనివారం రాత్రి కెమికల్‌ను తాను తాగి, పిల్లలకూ తాగించింది.
Comments
Please login to add a commentAdd a comment