తెల్లవారుజామున చుట్టుపక్కల వారంతా ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. మూడు నెలల గర్భిణి ఫ్యానుకు వేలాడుతుండడం చూసి హతాశులయ్యారు. ఉదయానికల్లా ఊరంతా విషాదం అలుముకుంది. బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన పాపిరెడ్డికి ఇద్దరు భార్యలు. రెండో భార్య పద్మావతమ్మకు ఒక కుమార్తె హరిత(23), ఒక కుమారుడు ఉన్నారు. హరితను అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి, పూర్ణమ్మ కుమారుడు ఆనందరెడ్డికి ఇచ్చి 4 నెలల క్రితం వైభవంగా వివాహం చేశారు. వివాహమైన నెల నుంచే అత్తింటి వేధింపులు ప్రారంభం అయ్యాయి. ఆనందరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్. లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లయినప్పటి నుంచి ఇంట్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. (కృష్ణప్రియ ఆత్మహత్య: వాట్సాప్ చాట్‌లో కీలక విషయాలు)
హరిత అరగొండ అపోలో ఆస్పత్రిలో పనిచేసేది. తరచూ అనుమానించి, అవమానించిన భర్త నెల క్రితం ఆమెను ఉద్యోగం మాన్పించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. అదే గ్రామంలో ఉన్న హరిత తల్లి వచ్చి నచ్చ చెప్పింది. అయితే అల్లుడు ఆనందరెడ్డి రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఒక్కటే ఉన్న కూతురుతోపాటు అక్కడే పడుకుంది. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో పాలు పితికేందుకు నిద్రలేచి తన ఇంటికి వెళ్లింది.
6 గంటల సమయంలో గ్రామంలో హరిత చనిపోయిందంటూ పరుగులు పెడుతుంటే తల్లి పోయి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. తన బిడ్డ మృతికి ఆనందరెడ్డి, పూర్ణమ్మ, రామిరెడ్డి కారణమంటూ మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాకరాపేట ఇన్‌చార్జ్ ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment