తెట్టు రైల్వే స్టేషన్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది.
దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్‌లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి.
నలుగురు దొంగలు!
హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది.
సూళ్లూరుపేట స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్‌ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment