సాక్షి, మెదక్: పచ్చటి పంట పొలాలతో కళకళలాడే మెతుకుసీమలో రక్తపు మరకలు అలజడి సృష్టిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి పైశాచికత్వంతో హత్యలకు తెగబడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, భూ వివాదాలే ఘటనలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. న్యాయస్థానాలు చట్టాలను కఠినతరం చేస్తూ దోషులను శిక్షిస్తున్నప్పటికీ మార్పు అనివార్యమవుతుంది. జిల్లాలో 12 నెలల్లో జరిగిన 18 హత్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుస హత్యలపై సాక్షి ప్రత్యేక కథనం..
►జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 469 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 21 పోలీస్ స్టేషన్‌లో ఉన్నాయి. ఇందులో ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఒక్క ఏఆర్ డీఎస్పీ, 57 మంది సీఐ, ఎస్‌ఐలు, సుమారు 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
►మూడేళ్లుగా పోలీస్ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 64 హత్య కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2019లో 19, 2020లో 27, 2021 ఇప్ప టి వరకు 18 హత్య కేసులు నమోదయ్యాయి.
►ఈ హత్య కేసుల్లో ఎక్కువగా ఆర్థికలావాదేవీలు, అక్రమ సంబంధాలు, భూవివాదాలు, ప్రేమ వివాదాలే కారణాలుగా నిలిచాయి.
►రూ.200 మొదలుకొని రూ. 2కోట్ల వరకు జరిగిన లావాదేవీల్లో హత్యలకు దారితీశాయి.
►భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, కులాంతర వివాహాలు వంటి పలు కారణాలు హత్యలకు ఆజ్యం పోస్తున్నాయి.
►నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు సినీ ఫక్కీని తలపించాయి. పథకం ప్రకారమే నేరాలకు తెగబడుతూ హత్య ఒక చోట చేసి శవాన్ని మరొకచోట పడేయటం, మృతదేహాన్ని గుర్తు పట్టలేనంతగా ఛిద్రం చేయడం వంటివి ఇటీవల జరిగిన ఘటనల్లో ఎక్కువగా వెలుగుచూశాయి.
►నిందితులు ఎంతో పకడ్బందీగా నేరాలకు పాల్ప డుతున్నప్పటికీ అధునాతన సాంకేతికత ఆధా రంగా పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నారు.
జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు:
►2019 అక్టోబర్ 26న ఓ గుర్తు తెలియని మహిళను హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో పడేశారు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.
►ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన హవేళిఘనపూర్ మండలం బూరుగుపల్లి గేట్ వద్ద కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన గడ్డి హనుమంతును కేవలం రూ.30 వేల అప్పు వివాదంలో అతడి సన్నిహితుడు బండ రాయితో కొట్టి అతికిరాతంగా హతమార్చాడు. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని రిమాండ్ చేశారు.
►ఈ ఏడాది ఆగస్టు 9 అర్ధరాత్రి వెల్దుర్తి మండలం మంగళపర్తి–యశ్వంతరావుపేట సమీపంలో మెదక్ పట్టణానికి చెందిన «బీజేపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్(కటికె శ్రీను) ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చి, కారుతో సహా నిప్పంటించి దహనం చేశారు. జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
►అదే రోజు మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద గ్రామానికి చెందిన బోల సిద్ధయ్యను కేవలం రూ. 200 కోసం ఎలాంటి పరిచయం లేని హవేళిఘనపూర్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన ఓ తాగుబోతు పదునైన బండ రాయితో కొట్టి చంపేశాడు. మృతుడి వద్ద నుంచి రూ. 1200లతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు.
►ఆగస్టు 27వ తేదీన కొల్చారం మండలం మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిలో లోతు వాగు వద్ద 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా కాలి్చవేశారు.
►అక్టోబర్ 21న కామారెడ్డి జిల్లా బిక్కనూర్ గ్రామానికి చెందిన మల్లయ్య మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో కుటుంబీకులే హత్య చేశారు. మెదక్–రామాయంపేట ప్రధాన రహదారిలో శమ్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలోని నీటి కుంటలో పడేశారు. పోలీసుల విచారణలో మృతుడి భార్య ఎల్లవ్వ, కూతురు రాణి, అల్లుడు రాజమల్లు ముగ్గురు కలిసే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరు
నేరం చేసే ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు, వివాహేత సంబంధాలు, కుటుంబ తగాదాలే హత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కక్ష్యపూరిత నిర్ణయాలతో విచక్షణను కోల్పోయి పథకం ప్రకారం హత్యలు చేస్తున్నారు. ప్రతీ కేసును సవాల్‌గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించిన 24 గంటల్లోనే పురోగతి సాధిస్తున్నాం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నాం. – చందనాదీప్తి, ఎస్పీ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment