బాలిక తండ్రి నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్పీ అస్మీ
కాకినాడలో ఘోరం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఓ దుర్మార్గుడి పైశాచికత్వానికి ముక్కుపచ్చలారని పసిమొగ్గ విలవిల్లాడింది. ఆర్తనాదాలు చేసింది. తెల్లవారు జామున ఒంటి నిండా తీవ్రగాయాలతో ఓ వీధిలో చెత్తకుప్పలో కనిపించిన ఆ చిన్నారిని చూసి కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. మరోవైపు లైంగికదాడికి గురై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా.. వైద్యులు పోలీసు సిఫారసు ఉంటే తప్ప వైద్యం చేయలేమని చెప్పడంతో వారు పరుగుపరుగున పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
సాక్షి, కాకినాడ: కాకినాడ గోళీలపేట దండోరా నగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి అమ్మమ్మ తాతయ్యల మధ్య నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 1.30 దాటాక చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లవారు జామున చిన్నారి తాతయ్య నల్లయ్య తన పక్కనే నిద్రించిన మనవరాలి కోసం చూడగా ఆమె కనిపించలేదు. భార్య కొత్తమ్మను నిద్రలేపి ఆరా తీశాడు. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారి తండ్రి రాజును నిద్రలేపి అడిగాడు. బాలిక ఏమైందో తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు, 50 మందికి పైగా స్థానికులు కలసి ఉదయం వరకు వెతికారు. సుమారు ఉదయం 4.30 సమయంలో బాలిక వివస్త్రగా, ఒంటి నిండా గాయాలు, పంటి గాట్లతో రంపంమిల్లు వీధిలోని చెత్తకుప్పలో అచేతన స్థితిలో లభ్యమైంది. చిన్నారి జాడ కోసం వెతుకుతున్న వారికి అత్యంత దయనీయస్థితిలో బాలిక కనిపించింది. తక్షణమే కుటుంబసభ్యులు పాప శరీరాన్ని శుభ్రపరిచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
బాలికను నిందితుడు వదిలి వెళ్లింది ఇక్కడే..
వైద్యం నిరాకరణ..
లైంగికదాడి జరగడంతో పోలీసుల సిఫారసు తప్పనిసరని చెబుతూ కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించడంతో తండ్రి పిల్లి రాజు, అమ్మమ్మ కన్నీటిపర్యంతమవుతూ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ టి.రామ్మోహన్‌రెడ్డి దృష్టికి వైద్యుల నిర్వాకాన్ని వెల్లడించారు. దీంతో సీఐ వారితో కలిసి హుటాహుటిన జీజీహెచ్‌కు వెళ్లి వైద్యుల తీరును నిలదీసి, చిన్నారులకు వైద్య సేవలందించేలా మాట్లాడారు.
అత్యంత పాశవికంగా..
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆగంతకుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. ఏడ్చినందుకు చెంపలపై బలంగా కొట్టాడు. చిన్నారి శరీరంలోని పలు భాగాల్లో తీవ్రమైన పంటిగాట్లను వైద్యులు గుర్తించారు. మట్టిలో పడేసి లైంగికదాడికి పాల్పడడంతో చిన్నారి వీపు భాగం పూర్తిగా కొట్టుకుపోయి రక్తసిక్తమైంది. జననాంగాలు, పెదవులపైన పంటిగాయాలున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది. అచేతన స్థితికి జారుకున్న తర్వాతే పాపను వదిలాడని, అప్పటి వరకు అత్యంత కర్కశంగా చిన్నారిపై విరుచుకుపడ్డాడని వైద్యులు తెలిపారు.
ముమ్మర తనిఖీలు
అత్యాచార ఘటనను జిల్లా పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందాలను నియమించి అగంతకుడి కోసం గాలింపు చేపట్టింది. పోలీస్ జాగిలాలు చిన్నారి ఇంటి పరిసరాల్లో పలుచోట్ల అనుమానిత స్థితిలో సంచరించాయి. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ బాలిక నిద్రించిన ఇంటిని పరిశీలించారు. గడియపెట్టి నిద్రపోయారా? తెరిచి ఉంచారా? అన్న అంశాలపై ఆరా తీశారు. ఉక్కపోత కారణంగా తలుపులు తెరిచి ఉంచినట్టు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అనుమానిత వ్యక్తి, వ్యక్తుల సంచారంపై డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలోని సీఐలు గోవిందరావు, ఈశ్వరుడు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. క్లూస్ బృందం బాలిక అదృశ్యమైన చోటు, లభ్యమైన చోట్లలో ఆధారాలను సేకరించారు.
పలువురి పరామర్శ
చిన్నారిని కాకినాడ జీజీహెచ్‌లో ఎస్పీ అస్మీ, జేసీ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. చిన్నారి తల్లి మరియ పని కోసం హైదరాబాద్‌లో ఉంటోందని, తండ్రి, తాతయ్య, అమ్మమ్మల సంరక్షణలో బాలిక ఉంటోందన్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిగా దిశ డీఎస్పీ మురళీమోహన్‌ను నియమించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్æ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
కీలక మలుపు
వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలిక కీలక ఆధారాన్ని వెల్లడించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి వివరాలను తెలిపింది. తండ్రి వరసయ్యే ఓ వ్యక్తి తనపై దారుణానికి ఒడిగట్టాడని, చిత్రహింసలు పెట్టి, కొడుతూ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించిన వీడియో సాక్షి చేతికి అందింది. నిందితుడి కుమారుడు బాలికతో సఖ్యంగా ఉండడంతో ఆ బాలుడి తండ్రేనని పదేపదే చెప్పింది. సదరు వ్యక్తి బాలికకు తండ్రి వరుస అవుతాడని కుటుంబసభ్యులు నిర్ధారించుకొని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశలోనే పోలీసులూ విచారణ జరుపుతున్నారు. అయితే బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment