సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ ఫహీమ్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్, అల్వాల్‌లోని ఇళ్లలో చోరీలకు పాల్పడి గుర్గావ్‌కు పారిపోయిన ఇద్దరు సభ్యులతో కూడిన వీరి ముఠాను బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు అక్కడే పట్టుకున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.
జైల్లో కలిసి...జట్టు కట్టి
యూపీలోని మోరాదాబాద్ జిల్లా, అజాద్‌నగర్‌కు చెందిన ఫహీమ్ అలియాస్ గ్లాస్ కటింగ్ పనిచేసేవాడు. అదే సమయంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేసేవాడు. 2013లో అక్రమ ఆయుధాల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి మురాదాబాద్ జైలుకు పంపారు. జైలులో అతడికి మహమ్మద్ ముర్సలిమ్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం ఇద్దరు కలిసి హర్యానాలోని గుర్గావ్‌లో గ్లాస్ కట్టింగ్ వ్యాపారం చేశారు. అయితే సరిపడా ఆదాయం రాకపోవడంతో ఇళ్లల్లో దోపిడీలకు పథకం వేశారు.
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
ముర్సలిమ్, అతడి స్నేహితుడు అరీఫ్ కలిసి ఫహీమ్ గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు తెరలేపాడు. దాదాపు వందకు చోరీలకు పాల్పడిన అతడు పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. తరచు నివాసాలు మార్చే అతను పోలీసుల కంటపడకుండా ఉండేందుకు ఏకంగా చోరీ సొత్తును కరిగించి బిస్కెట్‌లుగా మార్చి మార్కెట్లో విక్రయించేవాడు. 2017, 2018 మధ్యకాలంలో ఈ ముఠా చందానగర్, రాయదుర్గం, అమీన్‌పూర్ ఠాణాల పరిధిలో పంజా విసిరింది.
సైబరాబాద్‌కు వచ్చి... దొరికిపోయారు
ఈ నెల 4న అరీఫ్ ముఠా కారులో మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలో రెక్కీ నిర్వహించింది. పగటి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించిన వీరు వాటిని లూటీ చేసి హైవేపై వెళుతూ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ గుర్గావ్ చేరుకున్నారు.ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తెలివిగా వ్యవహరించారు. అయితే మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలోని ఘటనాస్థలి వద్ద సేకరించిన శాస్త్రీయ ఆధారాలతో గుర్గావ్‌లోని సోనా పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. బాలానగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది. స్థానిక పోలీసుల సహకారంతో ఫహీమ్, ముర్సలీమ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి బృందంతో పాటు బాలానగర్ డీఐ జేమ్స్‌బాబు, అల్వాల్ పోలీసు సిబ్బందిని సీపీ సజ్జనార్ సత్కరించారు. రెండేళ్లుగా 16 మంది అంతర్రాష్ట నేరగాళ్లను పట్టుకొని 60 కేసులను ఛేదించామని, ఇదంతా ఎస్‌ఓటీ, సీసీఎస్, క్లూస్‌టీమ్ సిబ్బంది కృషితోనే సాధ్యమైందన్నారు.
విల్లాలో మకాం..
యూపీ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న టాప్–10 గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడైన ఫహీమ్ గుర్గావ్‌లోని ఎంవీఎన్ సొసైటీ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో ఉంటున్నాడు. గతంలో బినామీ పేర్లపై ఉన్న రెండు ఇళ్లను మొరాదాబాద్ పోలీసులు సీజ్ చేయడంతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. దోపిడీ చేసిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. క్యాసినోతో పాటు లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు.
Comments
Please login to add a commentAdd a comment