పిల్లలతో ధనలక్ష్మి (ఫైల్)
చిన్నపాటి మనస్పర్థలకే కుంగిపోయావు.. మా నాన్నను వదిలి ఒంటరిగా జీవించాలనుకున్నావు.. అది సాధ్యం కాదని తెలిసి నీ తల్లిదండ్రుల చెంతకు చేరావు.. వారితోనూ సఖ్యతగా ఉండలేక విసిగిపోయావు ..
గొడవలకు దిగి మరింత మానసిక వేదనకు లోనయ్యావు.. కడుపుచించుకు పుట్టిన బిడ్డల్ని పోషించలేనని భావించావు.. ఒంటరిగా సమాజంలో బతకడం కష్టమని కుమిలిపోయావు.. ఇక చావే శరణ్యమని వ్యవసాయబావిని ఎంచుకున్నావు.. ఆ బావిలోనే మమ్మల్ని ముంచేసి.. నువ్వూ కడతేరిపోయావు..
అమ్మా ఎంతపనిచేశావమ్మా..? అన్నట్టు అభంశుభం తెలియని పసిపిల్లలు నీటిలో తేలియాడుతూ కనిపించడం చూపరులను కలచివేసింది. చిత్తూరులో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన తల్లీబిడ్డలు శుక్రవారం వ్యవసాయ బావిలో శవాలుగా తేలడం స్థానికంగా విషాదం అలముకుంది.
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓబనపల్లెకు చెందిన మునిరత్నం, పట్టమ్మ కుమార్తె ధనలక్ష్మి (28)కి పదేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరుకు చెందిన ముత్తుతో వివాహమైంది. వీళ్లకు ఝాన్సి (8), ఉదయ్ పిల్లలు ఉన్నారు. ముత్తు తాపీమేస్త్రీగా, ధనలక్ష్మి హైరోడ్డులోని ఓ హోటల్‌లో కూలీగా పనిచేసేవారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్నపాటి గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ముత్తు తన సొంతూరికి వెళ్లిపోగా, ధనలక్ష్మి ఓబనపల్లెలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, కుమారుడిని ఒకటో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ధనలక్ష్మి ఒంటరితనాన్ని భరించలే పోయింది. తల్లిదండ్రులతో సైతం పలుమార్లు మనస్పర్థలు రావడంతో మరింత కుంగిపోయింది. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష..)
ఈనెల 4వ తేదీ సాయంత్రం పిల్లలతో సహా ధనలక్ష్మి కనిపించకుండాపోయింది. భర్త వద్దకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఆపై రెండు రోజుల పాటు అన్నిచోట్లా విచారించారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 6వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, తెలిసిన వాళ్ల చిరునామాల్లో వెతకడం ప్రారంభించారు. ధనలక్ష్మి తన సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే వదలివెళ్లిపోవడంతో కేసు కొలిక్కిరాలేదు. శుక్రవారం ఉదయం ఓబనపల్లె వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలాయి. గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశారు.
బాధితుల్ని ఓదారుస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్‌ఐ మల్లికార్జునతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ధనలక్ష్మి పిల్లలుగా గుర్తించారు. కొంతసేపటి వరకు ధనలక్ష్మి కోసం బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు తీవ్రం చేయడంతో ఆమె మృతదేహం కూడా లభ్యమైంది. పిల్లల్ని ముందుగా బావిలో తోసి, ఆపై తనూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment