సాక్షి, చెన్న: పోర్చుగల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విదేశీ ఉద్యోగం పేరిట పలువురు నిరుద్యోగులకు ఓ తల్లి, కుమార్తె శఠగోపం పెట్టారు. చివరికి అమెరికాకు చెక్కేయడానికి సిద్ధమైన వీరిని పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వివరాలు.. వేళచ్చేరి భారతీ నగర్‌కు చెందిన తనిష్కా(34) ఐటీ ఉద్యోగి. విదేశాల్లో ఉద్యోగం ఆశతో మిత్రుల సాయంతో కోయంబేడులోని ఓ సంస్థను ఆమె సంప్రదించారు. పెద్దసంఖ్యలో విదేశీ ఉద్యోగం కోసం యువత, నిరుద్యోగులు ఆ సంస్థ వద్ద క్యూ కట్టడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ సంస్థ ద్వారా పోర్చుగల్‌కు వెళ్లేందుకు నిర్ణయించకుంది. ఇందుకోసం రూ. రూ. 25 లక్షలు ఖర్చు పెట్టింది.
అదే సమయంలో కరోనా పరిస్థితులు రావడంతో ఆ సంస్థ కొన్నాళ్లు మూత పడింది. తాజాగా ఉద్యోగం కోసం వెళ్లగా, సరైన సమాధానం ఇవ్వకుండా ఆ సంస్థ నిర్వాహకులు క్లీనాక్రియేటర్ (30), ఆమె తల్లి అనితా క్రియేటర్(55) దాట వేశారు. అయితే తన లాగే పలువురు నిరుద్యోగులు ఆ సంస్థ చుట్టూ తిరుగుతుండడంతో తనిష్కాకు అనుమానం నెలకొంది. దీంతో తనిష్కా వేళచ్చేరి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మీద దృష్టి పెట్టారు. ఈక్రమంలో ముందుగా చేసుకున్న ఏర్పాట్ల మేరకు సోమవారం అర్ధరాత్రి చెన్నై నుంచి అమెరికాకు వెళ్లేందుకు తల్లి కుమార్తెలు రెడీ అయ్యా రు. అయితే, వేళచ్చేరి పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిందితులను విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద పెద్దసంఖ్యలో యువత మోస పోయి ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో విదేశీ ఉద్యోగం పేరిట కోట్లాది రూపాయల్ని దండుకుని అమెరికాకు పారి పోయేందుకు సిద్ధమైనట్టుగా నిర్ధారించారు. కాగా ఈ తల్లి కుమార్తెల బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
చదవండి: Tamil Nadu: భర్త మరుగు దొడ్డి కట్టించలేదని.. ఉరితాడుకు రమ్య!
Comments
Please login to add a commentAdd a comment