కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్లరు వేసి.. | Mother Who Assassination Her Son In Guntur District | Sakshi
Sakshi News home page

కొడుకు ఆగడాలు భరించలేక...

Published Sun, Feb 7 2021 9:01 AM | Last Updated on Sun, Feb 7 2021 12:29 PM

Mother Who Assassination Her Son In Guntur District - Sakshi

సిద్ధార్థ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌హెచ్‌వో మల్లికార్జునరావు

పట్నంబజారు (గుంటూరు):  కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్లరు వేసి.. ఊపిరి ఆడకుండా పాలిథిన్‌ కవర్‌ తలకు చుట్టి.. ఆపైన దిండు మొహంపై అదిమి యువకుడిని హతమార్చిన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఇది ఎవరో శత్రువులు చేసిన పని కాదు.. పేగు పంచి ఇచ్చిన కన్నతల్లే హత్య చేయటం నగరంలో కలకలం రేపింది. కడుపు తెంచుకు పుట్టినోడు కష్టాలు పెడుతుంటే.. నిత్యం అవమానాలకు గురిచేస్తుంటే.. మద్యం..గంజాయి తాగి..వేధింపులకు పాల్పడుతుంటే.. విసిగి వేసారిన ఆ కన్నతల్లి కన్న మమకారాన్ని కూడా చంపుకొని బిడ్డను కడతేర్చిన ఉదంతం ఇది. నగరంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం 8వ లైనులో నివాసం ఉండే వల్లపు పోతురాజు, సుమలత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె పుష్పాంబికకు వివాహం కాగా, కుమారుడు సిద్ధార్థ (17) సిమెంట్‌ పనులు చేస్తుంటాడు. తల్లి సుమలత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ కారి్మకురాలిగా పనిచేస్తుంది. సిద్ధార్థ చిన్ననాటి నుంచే చెడు స్నేహాలు చేయటంతో దురలవాట్లకు బానిసగా మారాడు. పది సంవత్సరాల క్రితం తండ్రి పోతురాజు మరణించాడు. నిత్యం మద్యం, గంజాయి, సొల్యూషన్‌ తాగి వచ్చి, తల్లి సుమలతను డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటే.. ఇంటిపై రాళ్లు వేయటం, తల్లిని చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, కొడుతుండేవాడని పోలీసులు తెలిపారు. లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఒక చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు కావటంతో సుమారు 14 నెలల పాటు విజయవాడ జైలులో ఉన్నట్లు తెలిపారు.

శుక్రవారం రాత్రి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లి తెల్లవారుజామున 4గంటల సమయంలో రావటంతో, అప్పటికే పలు చోరీలు చేసిన కుమారుడు సిద్ధార్ధను ఎక్కడికి వెళ్లి వచ్చావని తల్లి ప్రశ్నించగా ఆమెను నానా దుర్భాషలాడాడు. సిద్ధార్థ వ్యవహరిస్తున్న తీరుతో బంధువులు, చుట్టుపక్కలవారు సుమలతను అవమానకరంగా మాట్లాడుతుండటంతో పలుమార్లు కొడుకును తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా ఎటువంటి మార్చు రాకపోవటంతో విసిగిపోయిన తల్లి సుమలత శనివారం మధ్యాహ్నం ఫూటుగా మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న కుమారుడిì  కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టరు చుట్టి, ఊపిరి ఆడకుండా కవర్‌ కట్టడంతో పాటు, దిండుతో అదిమి హతమార్చింది.   

నేరుగా స్టేషన్‌లో ఫిర్యాదు.. 
కుమారుడు సిద్ధార్థను హత్య చేసిన తల్లి సుమలత నేరుగా నగరంపాలెం స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. తన కుమారుడి తీరుతో విసిగిపోయిన తానే హత్య చేసినట్టు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు నివ్వెరపోయారు. స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని సిద్ధార్ధ మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement