సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీస్ అధికారులు- చిన్నారి తల్లిదండ్రులు
డెంకాడ(విజయనగరం జిల్లా): ఆలుమగలు మధ్య తలెత్తిన అనుమానం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. తల్లిదండ్రులను హంతుకులుగా మార్చింది. భర్త అనుమానాన్ని భరించలేక చిన్నారిని నేలబావిలో పడేసిన దురదృష్టకర ఘటన మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి భోగాపురం ఇన్‌చార్జి సీఐ లక్ష్మణరావు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డి.తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీనుకు, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత భార్యాభర్తల దాంపత్య జీవితంపై అనుమానాలు చోటుచేసుకున్నాయి. పెద్దకుమార్తె పుట్టిన కొన్నాళ్లకు భార్యభర్తలు ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. ఈ గొడవలు నేపథ్యంలోనే రెండో కుమార్తె రమ్య (4) జన్మించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి.
దీంతో కొంతకాలంగా మహాలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. అయితే, మహాలక్ష్మి తండ్రి ఈ మధ్య కాలంలో మరణించడంతో అత్తవారి ఇంటిలో అడుగుపెట్టేందుకు డి.తాళ్లవలసకు ఇద్దరు కుమార్తెలతో పాటు వచ్చింది. మళ్లీ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మహాలక్ష్మి తన రెండవ కుమార్తె రమ్యను గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో పడేసింది. అటువైపుగా వెళ్లిన వారు బావిలో తేలుతున్న చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త తన రెండవ కుమార్తె రమ్యపై ఉన్న అనుమానపు వేధింపులు భరించలేకే బావిలో పడేసినట్టు మహాలక్ష్మి పోలీసులకు వివరణ ఇచ్చింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బావిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
ఘటనా ప్రదేశాన్ని విజయనగరం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, భోగాపురం ఇన్‌చార్జి సీఐ లక్ష్మణరావు, డెంకాడ, భోగాపురం ఎస్‌ఐలు సాగర్ బాబు, మహేష్, ఏఎస్‌ఐ ఎం.రాంబాబు పరిశీలించారు. నిందితుల నుంచి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment