పోలీసుల కాల్పుల్లో గాయపడిన స్మగ్లర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఏవోబీ(ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు)లో భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
వీరిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై మరికొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది.
గంజాయి హబ్‌గా..
హైదరాబాద్‌లోని సింగిరేణి కాలనీలో గంజాయికి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలికను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యచరణ కు దిగింది. ఈ క్రమంలో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్లగొండ డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి. ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన బృందాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాలపై దాడులకు దిగాయి.
ఆదివారం 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, 20 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించుకునేందుకు ఆ ముఠాలోని మరికొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో రోడ్డుకు టిప్పర్‌ను అడ్డుపెట్టి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు జిల్లా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని, ఇద్దరు స్మగ్లర్లకు కాళ్లకు గాయాలైనట్లు పేర్కొన్నాయి.
పక్కా వ్యూహంతో..
వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్ చేయించారు.
కొనుగోలుదారుల పేరుతో రంగంలోకి దిగి.. గంజాయి కావాలని బేరం కుదుర్చుకున్నారు. అలా ఆప రేషన్ కొనసాగించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడులను ఏపీ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించామని నల్లగొండ ఎస్పీ చెబుతుండగా, విశాఖ ఎస్పీ మాత్రం నల్లగొండ పోలీసులు వచ్చిన సమాచా రమే తమకు తెలియదని చెప్పడం గమనార్హం.
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
‘విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి కేంద్రాలపై దాడులకు జిల్లా పోలీసు బృందాలు వెళ్లింది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో గంజాయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. అది కొనసాగుతున్న క్రమంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాయి. ఘటనలో ఏ ఒక్క పోలీస్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు’.
– నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్
20 మంది వరకు అరెస్టు...
‘విశాఖ లంబసింగి సమీపంలో ఆదివారం సాయంత్రం గంజాయి స్మగ్లర్‌ల నుంచి ఆత్మరక్షణ కోసమే నల్లగొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు తీగలాగుతూ గంజాయి స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం ధ్వంసం అయ్యింది. అయితే, అనుకోకుండా ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు గాయాలయ్యాయి. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేశాం’
– విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment