
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిత ఆత్మహత్యలపై ప్రత్యేక విచారణకు కమిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసు విచారణకు అధికారులను నియమించారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు డీఐజీ వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం నంద్యాలకు చేరుకుంది. అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను, వన్‌టౌన్ పోలీసులను ప్రత్యేక అధికారుల బృందం విచారించనుంది. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు.
కాగా, నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్‌సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment