అమ్మాయిలను పడేయడం అందరి వల్లా కాదురా.. అది ఒక ఆర్ట్ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ, ఆ పడేయడంలోనూ సినిమాటిక్ కోణాన్ని చూపించాడు ఓ గురుడు. ఈ టెక్నికల్ ఏజ్‌లో దేశ విదేశాల్లో అంతే హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఊహించని రేంజ్ విలాసాలను ప్రదర్శించడమే కాదు.. అమ్మాయిలను అంతే ఎమోషనల్‌గా ముగ్గులోకి దించి చివరికి డబ్బుతో ఉడాయించాడు. ఆ దెబ్బకు దివాళా తీసి రోడ్డున పడ్డ ఆ అమ్మాయిలు.. తమ వ్యధను తెరపైకి ‘ది ట్విండర్ స్విండ్లర్’(ట్విండర్ మోసగాడు) తీసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారారు.
The Twinder Swindler యూకేలో నెంబర్ వన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా ఉంది. అంత క్రేజ్ ఎందుకు అంటారా? అది ఒక వాస్తవిక గాథ కాబట్టి!. డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం తాలుకా సాక్ష్యం ఇది. ది టిండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ.. గత కొన్నిరోజులుగా ట్రెండింగ్‌లో నిలవడమే కాదు.. ఈ కేసులోని బాధితుల, నిందితుడి తరపున చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు.
ఆ మోసగాడి పేరు షిమన్ హయత్. ఇజ్రాయెల్ డైమండ్ మొఘల్ లెవ్ లెవెయివ్ కొడుకుగా సిమన్ లెవెయివ్ పేరుతో ప్రచారం చేసుకుంటూ డేటింగ్ యాప్ టిండర్‌లో డేటింగ్ వ్యవహారానికి తెర లేపాడు. ప్రైవేట్ విమానాల్లో విహారయాత్రలు, విలాసవంతమైన హోటళ్లలో లంచ్‌లు డిన్నర్లతో డేటింగ్ చేసిన అమ్మాయిలకు గాలం వేసేవాడు. ఆపై ఎమోషనల్ ట్రాప్‌తో వాళ్ల నుంచి డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. అలా ఎంత మందిని మోసం చేశాడో తెలియదు. కానీ, 10 మిలియన్ డాలర్లకుపైనే మోసానికి పాల్పడినట్లు ఒక అంచనా.
షిమన్ దెబ్బకు అప్పుల పాలై పీకలి లోతు అప్పులోకి మునిగిపోయిన ముగ్గురు యువతులు.. ఫండ్ రైజ్ ద్వారా కోలుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ది ట్విండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ వాళ్ల లాంటి ఎందరో బాధితులను వెలుగులోకి తీసుకొస్తోంది. తననూ ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడని, కానీ, అనుమానం రాగా.. తెలివిగా తప్పించుకున్నానని అర్జెంటీనాకు చెందిన ఓ యువతి వెల్లడించింది. అయితే 200 కే మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న షిమన్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయడంతో పాటు ఈ వ్యవహారంలో తనను ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చివరి మెసేజ్‌ను ఉంచడం కొసమెరుపు.
రివెంజ్ తీర్చుకునేందుకు బాధిత యువతులందరూ ఏకమవుతున్న తరుణంలో.. షిమన్ కౌంటర్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2020లో ఇజ్రాయెల్ కోర్టు కేవలం 47 వేల డాలర్లు మాత్రమే చెల్లించాలంటూ తక్కువ శిక్షతో సరిపెట్టడం బాధితులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడంతోపాటు శారీరకంగా, ఆర్థికంగా దోచుకున్న ఆ జల్సా రాజాకి సరైన గుణపాఠం చెప్పాలని పోరాడుతున్నారు. వీళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లు కొందరైతే.. గుడ్డిన నమ్మి మోసపోయారంటూ బాధితులనే తిట్టిపోసేవాళ్లు మరికొందరు!.
Comments
Please login to add a commentAdd a comment