సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.63 కోట్ల నిధుల కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌పై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ స్కామ్‌లో కీలకపాత్ర పోషించిన రాజ్‌కుమార్‌సహా నలుగురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ డబ్బును వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడానికి రాజ్‌కుమార్ అనే వ్యక్తి దళారిగా వ్యవహరించాడు.
డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన రాజ్‌కుమార్ అకాడమీ ఉద్యోగి రఫీ నుంచి ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులను తీసుకున్నాడు. కొన్నింటిని ఆయా బ్యాంకుల్లో వారంరోజులకే డిపాజిట్ చేశాడు. అయితే ఏడాది కాలానికి చేసినట్లు నకిలీవి సృష్టించి అకాడమీకి సమర్పించాడు. మరికొన్ని డిపాజిట్లు ఏడాది కాలానికి చేసినా నకిలీ బాండ్లను రూపొందించి తన వద్ద ఉంచుకున్నాడు.
ముగ్గురి సహకారం..
రాజ్‌కుమార్‌కు ది ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ బీవీవీఎన్ సత్యనారాయణరావు పూర్తి సహకారం అందించారు. సొసైటీలో తెరిచిన ఖాతా నుంచి రాజ్‌కుమార్ తదితరులు డ్రా చేసినప్పుడల్లా డబ్బును నేరుగా ఇచ్చేయాలంటూ విజయవాడ నుంచి సత్యనారాయణ ఇక్కడి బ్రాంచ్‌లో ఉన్న ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్‌షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్‌లకు ఆదేశాలు జారీ చేశాడు. ప్రతి విత్‌డ్రా సమయంలోనూ తన కమీషన్ 10 శాతం మినహాయించి మిగిలిన మొత్తం రాజ్‌కుమార్ తదితరులకు అప్పగించేలా ఆదేశించాడు.
సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో తెరిచిన నకిలీ ఖాతా నుంచి వివిధ దఫాలుగా డబ్బు డ్రా చేసిన దుండగులు ఆ మొత్తాన్ని వాహనాల్లో విజయవాడకు తరలించినట్లు తెలిసింది. ఈ ముఠా ఓ దఫా డబ్బును ముంబైకి కూడా తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆది, సోమవారాల్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఐటీ విభాగం దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు అవసరమైన రికార్డులు అందించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సమాచారం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment