
సాక్షి, హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి పేర్కొన్నాడు. శ్రావణి ఫోన్ కాల్ రికార్డింగ్ మొత్తం బయటపెడతానని, పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కూడా తాను సిద్ధమని తెలిపాడు. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య)
శ్రావణి తల్లిదండ్రుల ఒత్తిడితోనే గతంలో తనపై కేసు పెట్టిందని దేవరాజ్ రెడ్డి తెలిపాడు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందని, అందుకు తాను ఒప్పుకోకపోయేసరికి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. గతంలో తనపై పెట్టిన పోలీస్ కేసు వెనక్కి తీసుకుంటానని శ్రావణి చెప్పిందని, రెండు రోజుల క్రితం తామిద్దరం శ్రీకన్య రెస్టారెంట్‌కు వెళ్లినట్లు దేవరాజ్ రెడ్డి పేర్కొన్నాడు. ఆ సమయంలో సాయి ...ఆమెను కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడని తెలిపాడు. డబ్బుల కోసం తాను శ్రావణిని ఎప్పుడూ బ్లాక్‌మెయిల్ చేయాలేదని దేవరాజ్‌రెడ్డి స్పష్టం చేశాడు.
తనకు శ్రావణి చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు తనను సాయి, కుటుంబ సభ్యులు హింసిస్తున్నారంటూ అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పిందని పేర్కొన్నాడు. చావు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని తాను శ్రావణికి చెప్పానంటూ, అందుకు సంబంధించిన కాల్ రికార్డ్‌ను అతడు బయటపెట్టాడు. మరోవైపు శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం విజయవాడ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment