సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సూత్రధారులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో కనిపెట్టారు. సోమవారం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రత్యేక బృందంపై దాడికి దిగాడు. అతికష్టమ్మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో సహా మొత్తం నలుగురిని పట్టుకున్న పోలీసులు సిటీకి తరలిస్తున్నారు.
మరోపక్క ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహేష్ బ్యాంక్ సొమ్ము తొలుత 4 ఖాతాల్లోకి బదిలీ అయింది. ఆపై వాటి నుంచి ఢిల్లీ, బెంగళూర్, కేరళ సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 128 ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి కాజేశారు. సూత్రధారులతో పాటు ఈ ఖాతాదారులనూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్ టీమ్ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితలను అరెస్టు చేసింది.
రెండు కిలోమీటర్లు వెంటాడి...
పట్టుబడిన వారి ప్రాథమిక విచారణ నేపథ్యంలో కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కేరళల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవ్వరూ చిక్కకపోయినా.. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం మాత్రం ముగ్గురు ఖాతాదారులతో పాటు దళారిగా వ్యవహరించిన ఓ నైజీరియన్‌ను గుర్తించింది.
వారిని పట్టుకున్న పోలీసులు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. హఠాత్తుగా అతను పోలీసులపై ఎదురుతిరిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ అతడి ఫ్లాట్ నుంచి బయటకు పరుగుతీశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ వీధుల్లో అతడి కోసం భారీ ఛేజింగ్ చేశారు. దాదాపు 2 కి.మీ. వెంటాడి అదుపులోకి తీసుకోగలిగారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సైతం మరికొందరు ఖాతాదారులను పట్టుకున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ సహా ఇతర సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment