సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఇటీవల 9 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు ధ్రువపరిచే ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. అయితే, నలుగురు నిందితులకుగాను శ్మశాన వాటికలో పూజారి రాధేశ్యామ్, శ్మశానవాటిక ఉద్యోగి కుల్దీప్ సింగ్ మాత్రం అత్యాచారం చేసి, బాలికను చంపినట్లు వెల్లడించారని కోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. మిగతా ఇద్దరు నిందితులు సలీం అహ్మద్, లక్ష్మీనారాయణ బాలిక మృతదే హాన్ని దహనం చేయడంలో వారికి సహకరించారన్నారు.
హత్యకు ముందు రేప్‌నకు గురైనట్లు ఆధారాల్లేవు
‘హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అని నిర్ధారించేందుకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అందుకే ఈ సమయంలో బాలిక అత్యాచారానికి గురైందీ లేనిదీ స్పష్టంగా చెప్పలేం. ఇలా, ఏ విధమైన ఆధారాలు లేకుండా నిందితులు పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలను చట్టం అంగీకరించదు’ అని స్పెషల్ జడ్జి అశుతోష్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, కూతురును కోల్పోయిన బాలిక తల్లికి తాత్కాలిక సాయంగా రూ.2.5 లక్షలను అందించాలని ఆయన ఆదేశించారు.
పోలీసులు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించిన తర్వాత.. చట్ట ప్రకారం అందాల్సిన రూ.10 లక్షల్లో మిగతా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిందితులు నలుగురికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించారు. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే మృతదేహాన్ని దహనం చేసినట్లు ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీ పోలీసులు హత్య, అత్యాచారం పోక్సో, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment