![Ongole court Sentenced Capital Punishment To Munna And His Gang - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/24/munna.jpg.webp?itok=3-laGH30)
సాక్షి, ప్రకాశం జిల్లా: హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతడితో పాటు మరో 10 మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. కాగా పోలీసులం అంటూ లారీలను తనిఖీ చేసి పలువురు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపిన కేసులో మున్నా దోషిగా ఉన్నాడు. 2008లో వెలుగు చూసిన ఇలాంటి 4 కేసుల్లో మొత్తం 18 మందిపై నేరం నిర్ధారణ అయ్యింది.
తనిఖీ పేరిట ఆపి..
మున్నా గ్యాంగ్ పోలీసుల మాదిరి వేషాలు ధరించి హైవేపై వాహనాలను ఆపేవారు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు పాశవికంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో తేలింది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు.
తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ పనేనని తెలుసుకున్నారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అప్రమత్తమైన మున్నా.. దేశం వదిలి పారిపోయేందుకు యత్నించాడు. అయితే ఎట్టకేలకు కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఒంగోలుకు తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment